తనకన్నా చిన్నవాడిని పెళ్లాడనున్న అనుష్క!

29-04-2021 Thu 08:51
  • గతంలోనే అనుష్క పెళ్లి వార్తలు
  • తాజాగా పెళ్లికి ఓకే అనడంతో దుబాయ్ వ్యాపారవేత్తను చూసిన పెద్దలు
  • కరోనా పోయిన తరువాత ముహూర్తం
  • ఇంకా వెలువడని అధికారిక సమాచారం
Anushka Shetty Marrage With Dubai Business Man

చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ గా ఉన్న లేడీ ఎవరంటే, మొదటిగా వినిపించేది అనుష్క పేరే. గత కొంతకాలంగా అనుష్క పెళ్లిపై ఎన్నో వార్తలు వచ్చాయి. ప్రభాస్ తో ఆమె లవ్ లోఉందని, వారిద్దరి వివాహం జరుగుతుందని కూడా వార్తలు వచ్చాయి. అయితే, వీటన్నింటినీ అటు అనుష్క, ఇటు ప్రభాస్ ఇద్దరూ ఖండించారు. తాము మంచి స్నేహితులం మాత్రమేనని స్పష్టం చేశారు.

ఇక తాజాగా టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న వార్త ప్రకారం, దుబాయ్ కి చెందిన ఓ యువ వ్యాపారవేత్తతో అనుష్క వివాహం జరుగనున్నదట. ఆ వ్యాపారవేత్త అనుష్క కన్నా వయసులో చిన్నవాడని కూడా తెలుస్తోంది. ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే అనుష్క, ఇటీవలి కాలంలో పనిభారాన్ని తగ్గించుకుంది. తాజాగా, పెళ్లికి ఓకే అనడంతో, అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట.

కరోనా మహమ్మారి నియంత్రణలోకి వచ్చి, పరిస్థితులు చక్కబడిన తరువాత, రెండు కుటుంబాలూ కలిసి కూర్చుని మాట్లాడుకుని, వివాహానికి ముహూర్తం నిర్ణయించుకుంటారని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. ఈ విషయంలో అధికారికంగా ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. నిజం తెలియాలంటే, అనుష్క నోరు విప్పేవరకూ వేచి చూడాల్సిందే.