ఆసుపత్రులకు ఆక్సిజన్‌ అందించేందుకు తమ ఫ్యాక్టరీలు మూసివేసిన మారుతీ!

28-04-2021 Wed 19:49
  • ఆక్సిజన్‌ కొరతను అధిగమించేందుకు సంస్థల సహకారం
  • క్రయోజనిక్‌ ట్యాంకర్లు దిగుమతి చేసుకున్న పలు సంస్థలు
  • తాజాగా ఈ జాబితాలో చేరిన మారుతీ
  • మే 1-9 మధ్య హర్యానాలోని ఫ్యాక్టరీల మూసివేత
Maruti suzuki decided to shut its factories to supply oxygen

దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ కొరత తీవ్ర ఆందోళన కలిగిస్తున్న వేళ పలు వ్యాపార సంస్థలు తమ వంతు తోడ్పాటునందిస్తున్నాయి. ఇప్పటికే టాటా, రిలయన్స్‌, ఐటీసీ వంటి సంస్థలు ఆక్సిజన్‌ సరఫరాకు క్రయోజనిక్‌ ట్యాంకర్లను దిగుమతి చేసుకోగా.. మరికొన్ని సంస్థలు తమ కార్యకలాపాలను నిలిపివేసి ఆక్సిజన్‌ ఉత్పత్తిని చేపట్టాయి.

తాజాగా దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ సైతం తన వంతు సాయం చేయడానికి ముందుకు వచ్చింది. ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ కొరత నేపథ్యంలో  హర్యానాలోని తమ ఫ్యాక్టరీలను మే 1 నుంచి మే 9 వరకు మూసివేయాలని నిర్ధయించింది.  తద్వారా అక్కడ వినియోగించే అక్సిజన్‌ను ఆసుపత్రులకు అందజేయనున్నారు.

సాధారణంగా మెయింటెనెన్స్‌ కోసమని ప్రతి ఏడాది రెండుసార్లు ఫ్యాక్టరీలను కొద్దిరోజుల పాటు మూసివేస్తుంటారు. అయితే ఈసారి జూన్‌లో మారుతీ తమ ఫ్యాక్టరీలను నిలిపివేయాల్సిన ఉంది. కానీ, ఆక్సిజన్‌ను వైద్య అవసరాలకు మళ్లించాలన్న ఉద్దేశంతో ఈసారి కాస్త ముందుగానే మూసివేయనున్నట్లు మారుతీ తెలిపింది. గుజరాత్‌లోని సుజుకీ మోటార్స్ ఇండియా కూడా ఇదే నిర్ణయం తీసుకుంది.