అంతగట్టిగా అరవకు డాళింగ్ .. నా డైలాగ్ మరిచిపోతున్నాను అన్నాడట!

28-04-2021 Wed 19:34
  • ప్రభాస్ ఎంతో మంచి మనిషి
  • అలాంటి వ్యక్తిని నేను చూడలేదు
  • ఆయనను నా లైఫ్ లో మరిచిపోలేను

Adithya shares his funny incident in Baahubali

ప్రభాస్ ను ఒక హీరోగానే అందరూ ప్రేమిస్తారనుకుంటే పొరపాటే. ఆయన వ్యక్తిత్వాన్ని దగ్గరగా చూసినవాళ్లు ఎవరైనా ఆయనను అభిమానించకుండా .. ఆరాధించకుండా ఉండలేరు. ఇక ప్రభాస్ తో కలిసి నటించిన ఆర్టిస్టులు ఆయన గురించి పంచుకునే విషయాలు అభిమానులకు మరింత ఆసక్తిని కలిగిస్తూ ఉంటాయి. ఆయన ఎంత సింపుల్ గా ఉంటారు .. ఎంత వినయంగా ఉంటారు .. ఎంత ఆత్మీయంగా వ్యవహరిస్తారో తెలుసుకుని పొంగిపోతుంటారు. తాజా ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి నటుడు ఆదిత్య ఒక విషయాన్ని గురించి ప్రస్తావించాడు.

'బాహుబలి'లో నేను ఒక చిన్నపాత్ర చేశాను .. ''యుద్ధానికి వెళ్లకపోతే అమ్మ ఆగ్రహిస్తుంది .. పెనుముప్పు తప్పదు యువరాజా" అనేది నా డైలాగ్. ఆ డైలాగ్ ను నేను చాలా గట్టిగా చెప్పాను. ఆ తరువాత డైలాగ్ ప్రభాస్ చెప్పాలి .. కానీ ఆయన చెప్పకుండా నా దగ్గరికి వస్తున్నాడు. అది చూసి 'వామ్మో ఈయనేంటి నా దగ్గరికి వస్తున్నాడు' అనుకున్నాను. ''డాళింగ్ ఏవనుకోకేం .. కొంచెం మెల్లగా చెప్పవా .. నా డైలాగ్ ను మరిచిపోతున్నాను" అన్నారాయన. ఆయన అలా అనడాన్ని నేను నా జీవితంలో మరిచిపోలేను. నిజంగా ప్రభాస్ చాలా మంచివ్యక్తి .. ఆయనలాంటి మంచి వ్యక్తిని నేను ఇంతవరకూ చూడలేదు" అని చెప్పుకొచ్చాడు.