కరోనా మూడో వేవ్, నాలుగో వేవ్ కు సిద్ధంగా ఉండండి: నితిన్ గడ్కరీ

28-04-2021 Wed 19:30
  • ఆసుపత్రులు తక్షణమే బెడ్ల సంఖ్యను పెంచాలి
  • ఆక్సిజన్ కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం
  • రెమిడిసివిర్ ఉత్పత్తిని జెనెటిక్ లైఫ్ సైన్సెన్స్ ఈరోజు ప్రారంభించింది
Be ready to face Corona third wave says Nitin Gadkari

కరోనా సెకండ్ వేవ్ కే యావత్ దేశం అల్లాడిపోతోంది. జనాలు పిట్టలు రాలినట్టు రాలిపోతున్నారు. ఈ తరుణంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా మూడే వేవ్, నాలుగో వేవ్ ను ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని అన్నారు. ఆసుపత్రులన్నీ తక్షణమే బెడ్ల సంఖ్యను పెంచాలని సూచించారు. మహమ్మారిని ఎదుర్కోవడానికి వైద్య రంగంలో మౌలికవసతులను పెంచాలని చెప్పారు. ఆసుపత్రులకు అంతరాయం లేకుండా ఆక్సిజన్ ను అందించడానికి అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు.

కరోనా వైద్యంలో వినియోగిస్తున్న రెమిడిసివిర్ కు అమాంతం డిమాండ్ పెరిగిపోవడంపై గడ్కరీ మాట్లాడుతూ... జెనెటిక్ లైఫ్ సైన్సెస్ తన వార్దాలోని ప్లాంటులో ఈరోజు నుంచి రెమిడిసివిర్ ఉత్పత్తిని ప్రారంభించిందని చెప్పారు. ప్రతిరోజు 30 వేల వయల్స్ రెమిడిసివిర్ ను తయారు చేస్తుందని తెలిపారు. ఈ ఇంజెక్షన్లను మహారాష్ట్రలోని నాగపూర్ తో పాటు విదర్భ ప్రాంతంలోని ఇతర జిల్లాలకు సరఫరా చేస్తామని చెప్పారు.