వాయిదా పడిన మణిరత్నం షూటింగ్

28-04-2021 Wed 18:51
  • చారిత్రక నేపథ్యంలో సాగే కథ
  • భారీ తారాగణంతో రూపొందుతున్న చిత్రం
  • జూన్ నుంచి మళ్లీ షూటింగ్  

Manirrathnam movie shooting is postponed due to corona effect
మణిరత్నం ఇప్పుడు ఓ భారీ చారిత్రక చిత్రాన్ని తలపెట్టారనే విషయం తెలిసిందే. రాజరాజచోళుడికి సంబంధించిన ఒక యదార్థ సంఘటనను ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందుతోంది. కల్కి కృష్ణమూర్తి రాసిన నవలను బట్టి కథను సిద్ధం చేసుకున్నారు. ఈ సినిమాలో మణిరత్నం ప్రతిపాత్రను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో, ఉత్తరాదిన .. దక్షిణాదిన మంచి క్రేజ్ ఉన్న నటీనటులను తీసుకున్నారు. ఆ జాబితాలో ఐశ్వర్య రాయ్ .. విక్రమ్ .. కార్తి .. అదితీరావు .. త్రిష .. జయం రవి .. ప్రభు తదితరులు కనిపిస్తున్నారు.

ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ను మధ్యప్రదేశ్ లో ప్లాన్ చేశారు. కానీ కరోనా కారణంగా అక్కడ షూటింగు చేయడం కుదరలేదు. అక్కడ చిత్రీకరించవలసిన సన్నివేశాలను చెన్నైలోనే కానిచ్చేద్దామని అనుకుంటే, ఇక్కడ కూడా కరోనా ఉధృతి కారణంగా షూటింగు ఆగిపోయింది. దాంతో జూన్ లో మళ్లీ సెట్స్ పైకి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ లోగా కరోనా ప్రభావం చాలావరకూ తగ్గవచ్చని భావిస్తున్నారట. ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి ఉంది. ఇది ఒక చరిత్ర సృష్టించడం ఖాయమనే అభిప్రాయాలను మణిరత్నం అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.