Vishnu Vardhan Reddy: పలు డిమాండ్లతో జగన్ కు లేఖ రాసిన విష్ణువర్ధన్ రెడ్డి

  • కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామన్న మీ హామీ కార్యరూపం దాల్చలేదు
  • అనారోగ్య కారణాలతో చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలి
  • కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగావకాశం కల్పించాలి
Vishnu Vardhan Reddy writes letter to Jagan

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కాలేజీల్లో పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు న్యాయం చేయాలని కోరూతూ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. గత 20 ఏళ్లుగా కాంట్రాక్టు ప్రాతిపదికన అధ్యాపకులు పని చేస్తున్నారని... ఉద్యోగ భద్రత లేక వారంతా ఎంతో ఒత్తిడికి గురవుతున్నారని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తామంటూ మీరు ఇచ్చిన హామీ ఇంతవరకు ఆచరణకు నోచుకోలేదని చెప్పారు.

ఇప్పటికే పలువురు ఒప్పంద అధ్యాపకులు కరోనా, ఇతర అనారోగ్య కారణాలతో మృత్యువాత పడ్డారని విష్ణు తెలిపారు. వారి కుటుంబీకులు కూడా మరణిస్తున్నారని చెప్పారు. దీంతో, వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని తెలిపారు. అనారోగ్యం కారణంగా చనిపోయిన కుటుంబాలకు వెంటనే ఆర్థికసాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం సహాయనిధి నుంచి సాయం చేయాలని చెప్పారు. కరోనా లేదా ఇతర అనారోగ్య కారణాలతో చనిపోయిన ఉద్యోగుల కుటుంబసభ్యులలో ఒకరికి కనీసం పొరుగు సేవల ద్వారా అయినా ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు.

ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయసును 58 సంవత్సరాల నుంచి 60 ఏళ్లకు పెంచారని... కానీ, డిగ్రీ కాలేజీల్లో పని చేసే వారికి దాన్ని అమలు చేయడం లేదని చెప్పారు. ఇదే వయసును కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలని కోరారు. ప్రభుత్వం నియమించిన కమిటీ వెంటనే నివేదికను అందజేయాలని... ఉద్యోగులకు ఆర్థిక భద్రతతో కూడిన ఉద్యోగ భద్రతను కల్పించాలని డిమాండ్ చేశారు. గత సంవత్సర కాలంగా కమిషన్ స్థాయిలో ఉన్న చనిపోయిన దాదాపు 60 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షల ఆర్థిక సాయం అందించాలని కోరారు.

More Telugu News