'మహర్షి' దర్శకుడితో పవన్ కల్యాణ్?

28-04-2021 Wed 18:10
  • పవన్ తో దిల్ రాజు ఫస్టు మూవీగా 'వకీల్ సాబ్'
  • రెండవ సినిమా కోసం సన్నాహాలు
  • వంశీ పైడిపల్లి కథకు దిల్ రాజు ఓకే

Vamsi Paidipalli is going to direct for Pavan kalyan movie

పవన్ కల్యాణ్ - దిల్ రాజు కాంబినేషన్లో ఇటీవల 'వకీల్ సాబ్' వచ్చింది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో, ఒక రేంజ్ లో పవన్ రీ ఎంట్రీ జరిగింది. తమ కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమానే భారీ విజయాన్ని సాధించడంతో, మరో సినిమాను చేయాలని దిల్ రాజు - పవన్ నిర్ణయించుకున్నారు. అందుకోసం పవన్ బాడీ లాంగ్వేజ్ కి తగిన విభిన్నమైన కథలను రెడీ చేయమని వేణు శ్రీరామ్ తో పాటు, మరో ఇద్దరు దర్శకులకు దిల్ రాజు చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ ప్రాజెక్టుకు దర్శకుడిగా వంశీ పైడిపల్లి పేరు తెరపైకి వచ్చింది.

దిల్ రాజు కొత్త కథల కోసం ఎదురుచూస్తున్నాడని తెలిసిన వంశీ పైడిపల్లి, తాను సిద్ధం చేసిన ఒక కథను వినిపించాడట. ఆ కథ వైవిధ్యభరితంగా అనిపించడంతో, దిల్ రాజు ఓకే చెప్పాడని అంటున్నారు. ఈ కథను పవన్ కి వినిపించవలసి ఉంది. ఇటీవల కరోనా బారిన పడిన పవన్, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. పూర్తిగా కోలుకున్న తరువాతనే ఆయన ఈ కథను వినే అవకాశం ఉంది. 'మహర్షి' తరువాత వంశీ పైడిపల్లి చేసే ప్రాజెక్టు ఇదే అయితే బాగానే ఉంటుంది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాలు పూర్తి చేసిన తరువాతనే పవన్ మళ్లీ దిల్ రాజుకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.