సీఎం జగన్ కు సీబీఐ కోర్టు నోటీసులు

28-04-2021 Wed 17:46
  • ఇటీవల రఘురామకృష్ణరాజు పిటిషన్
  • విచారణకు అర్హమైనదిగా భావించిన సీబీఐ కోర్టు
  • జగన్ తో పాటు సీబీఐకి నోటీసులు
  • పిటిషన్ లో అంశాలపై వివరణ ఇవ్వాలని ఆదేశం
  • వచ్చే నెల 7న విచారణ
CBI Court issues notice to CM Jagan and CBI

అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇటీవల నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. జగన్ బెయిల్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాడని, తన కేసులో సాక్షులను ప్రభావితం చేస్తున్నాడని రఘురామ తన పిటిషన్ లో ఆరోపించారు. ఈ పిటిషన్ ను విచారణకు అర్హమైనదిగా భావించిన న్యాయస్థానం నేడు సీఎం జగన్ కు, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. పిటిషన్ లో పేర్కొన్న అంశాలపై వివరణ ఇవ్వాలని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. దీనిపై వచ్చే నెల 7న విచారణ చేపట్టాలని నిర్ణయించింది.

కొన్నిరోజుల కిందట రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేయగా, తొలుత సాంకేతిక కారణాలతో ఆ పిటిషన్ ను కోర్టు రిటర్న్ చేసింది. అయితే కొన్ని సవరణల అనంతరం రఘురామ మరోసారి పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు ఈసారి స్వీకరించింది. ఈ నేపథ్యంలోనే జగన్ కు, సీబీఐకి నోటీసులు జారీ చేసింది.