'ఎఫ్ 3' థియేటర్లకు వచ్చేది అప్పుడేనట!

28-04-2021 Wed 17:34
  • అనుకున్నట్టుగా సాగని షూటింగ్
  • ఆగస్టులో థియేటర్లకు రాదనే టాక్
  • సంక్రాంతి సెంటిమెంట్ పైనే దృష్టి  

F3 is going to hit on the theatres on Sankranthi

రాజమౌళి .. కొరటాల తరువాత ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడిగా అనిల్ రావిపూడికి మంచి పేరు ఉంది. ప్రస్తుతం ఆయన 'ఎఫ్ 3' సినిమా చేస్తున్నాడు. గతంలో వచ్చిన 'ఎఫ్ 2' సినిమాకు ఇది రీమేక్. వెంకటేశ్ .. వరుణ్ తేజ్ .. తమన్నా .. మెహ్రీన్ నాయకా నాయికలుగా నటించిన ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. వసూళ్ల పరంగా కొత్త రికార్డులను నమోదు చేసింది. ఇప్పుడు ఇదే టీమ్ తో 'ఎఫ్ 3' నిర్మితమవుతోంది. డబ్బు వలన వచ్చే ఫ్రస్టేషన్ చుట్టూ ఈ కథ తిరగనుంది. ఆల్రెడీ కొంత చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా, త్వరలో మళ్లీ సెట్స్ పైకి వెళ్లనుంది.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 27వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ అనుకున్నట్టుగా షూటింగు జరగలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మళ్లీ మొదలుపెట్టే అవకాశం కూడా లేదు. అందువలన పరిస్థితులు అనుకూలించిన తరువాతనే రంగంలోకి దిగేసి, సంక్రాంతికి విడుదల చేయడమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. 'ఎఫ్ 2' .. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలు సంక్రాంతికే సందడి చేశాయి. ఆ సెంటిమెంట్ కలిసి వస్తుందనే ఉద్దేశంతో దిల్ రాజు - అనిల్ రావిపూడి ఉన్నారని చెప్పుకుంటున్నారు.