ప్రజల ధనంతో వ్యాక్సిన్ తయారు చేసి.. వారికే ఎక్కువ ధరకు అమ్ముతున్నారు: రాహుల్ గాంధీ

28-04-2021 Wed 17:12
  • మిత్రుల కోసం మోదీ ప్రజలను దోచుకుంటున్నారు
  • మన దేశంలోని టీకానే ప్రపంచంలో ఖరీదైనది
  • ప్రజలను మోదీ ప్రభుత్వం మోసం చేస్తోంది
Modi govt looting people for his friends says Rahul Gandhi

ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. దేశంలో తయారవుతున్న కరోనా వ్యాక్సిన్ ను ప్రజల ధనంతోనే తయారు చేస్తున్నారని... కానీ, అదే ప్రజలకు టీకాను అధిక ధరకు అమ్ముతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రధాని మోదీ తన మిత్రుల కోసం ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు. ట్విట్టర్ ద్వారా ఆయన ఈమేరకు విమర్శలు గుప్పించారు.

టీకా తయారు చేయడానికి ఫార్మా కంపెనీలకు ప్రజా ధనాన్ని కేంద ప్రభుత్వం ఇచ్చిందని... అదే ప్రజలకు అధిక ధరకు వ్యాక్సిన్ అమ్మడానికి అనుమతులు ఇచ్చిందని రాహుల్ దుయ్యబట్టారు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన వ్యాక్సిన్ మన దేశంలో అమ్ముతున్నదేనని చెప్పారు. మోదీ విఫల విధానం... ప్రజలను మరోసారి మోసం చేస్తోందని అన్నారు. స్నేహితుల లాభం కోసం ప్రజలను మోదీ దోచుకుంటున్నారని మండిపడ్డారు.