కరోనా రోగులు పూర్తిగా కోలుకునేవరకు బాధ్యత తీసుకుంటాం: ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని

28-04-2021 Wed 15:36
  • ఏపీలో కరోనా చికిత్స, ఇతర అంశాలపై ఆళ్ల నాని ప్రెస్ మీట్
  • కరోనా బాధితులకు ఎలాంటి సాయమైనా చేస్తామని వెల్లడి
  • అధిక లక్షణాలున్న వారికి ఆసుపత్రుల్లో చికిత్స
  • తక్కువ లక్షణాలుంటే కొవిడ్ కేర్ సెంటర్లలో చికిత్ప
Alla Nani press meet about corona treatment in state

ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మంగళగిరిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా రోగులు పూర్తిగా కోలుకునేంత వరకు బాధ్యత తీసుకుంటామని స్పష్టం చేశారు. కరోనా బాధితులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయమైనా అందిస్తామని చెప్పారు.

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న కొద్దీ బెడ్ల సమస్యను తీర్చేందుకు 60 వరకు కొవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఆసుపత్రుల్లో పడకల కోసం డిమాండ్ పెరిగిపోతోందని, అదనంగా 33 వేల బెడ్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. అయితే, తీవ్ర లక్షణాలతో బాధపడుతున్న వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని, తక్కువ లక్షణాలు ఉన్నవారికి కొవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స జరుపుతున్నామని మంత్రి ఆళ్ల నాని వివరించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా ఆక్సిజన్ కొరత రాకుండా చూస్తున్నామని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కేంద్రం సరఫరా చేస్తున్న ఆక్సిజన్ కేటాయింపులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ల కోసం ఏర్పడిన డిమాండ్ ను తాము నియంత్రించగలిగామని, బ్లాక్ మార్కెట్ కు తరలివెళ్లడాన్ని అరికట్టగలిగామని వెల్లడించారు.