కరోనా కట్టడికి ప్రభుత్వం ఇంకా మెరుగైన చర్యలు తీసుకోవాలి: ఏపీ హైకోర్టు

28-04-2021 Wed 15:24
  • కరోనా అంశాలపై పిటిషన్లను విచారించిన హైకోర్టు
  • పరీక్షల నివేదికలు త్వరగా వచ్చేలా చూడాలని ఆదేశం
  • పర్యవేక్షణకు ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేయాలని వెల్లడి
  • నోడల్ అధికారులను నియమించాలని స్పష్టీకరణ
AP High Court says lot more measures to be taken by AP Govt

ఏపీలో కరోనా వ్యాప్తి, ఇతర పరిస్థితులపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది. కరోనా కట్టడికి ప్రభుత్వం ఇంకా మెరుగైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పరీక్షల నివేదికలు త్వరగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కరోనా చికిత్స పర్యవేక్షణకు ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేయాలని సూచించింది. కొవిడ్ చికిత్స అందిస్తున్న ఆసుపత్రుల్లో రోగులు, బెడ్ల వివరాలు, ప్రైవేటు ఆసుపత్రుల ఫీజులు ప్రదర్శించాలని తెలిపింది.

కరోనా పరిస్థితి పర్యవేక్షణకు నోడల్ అధికారులను నియమించాలని న్యాయస్థానం పేర్కొంది. నోడల్ అధికారుల ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, ఐసోలేషన్ కేంద్రాలను పెంచాలని సూచించింది. తోట సురేశ్, ఏపీ పౌర హక్కుల సంఘం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ మేరకు స్పందించింది.