గుంటూరులో ఘటన.. మాస్క్ పెట్టుకోమన్నందుకు కార్పొరేటర్ పై యువకుడి దాడి!

28-04-2021 Wed 14:52
  • ఈరోజు బ్రాడీపేటలో పర్యటించిన కార్పొరేటర్ వెంకటకృష్ణాచారి
  • మాస్క్ ధరించని యువకుడిని మందలించిన వైనం
  • గొడవ తర్వాత యువకులను చితకబాదిన కార్పొరేటర్ అనుచరులు
Man attacked corporator for asking to put mask

కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిరోజు చెపుతూనే ఉన్నాయి. కానీ, ఎంతో మంది బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ, మాస్కులను ధరించకుండా తమ వంతుగా కరోనా విస్తరణకు కారకులవుతున్నారు. తాజాగా గుంటూరులో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. మాస్క్ ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నించిన పాపానికి ఓ కార్పొరేటర్ పై ఒక యువకుడు దాడి చేశాడు.

వివరాల్లోకి వెళ్తే, గుంటూరు 32వ డివిజన్ కార్పొరేటర్ వెంకటకృష్ణాచారి ఈరోజు బ్రాడీపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా నాలుగో లైన్ లో ఉన్న బోయ్స్ హాస్టల్ వద్ద కొందరు యువకులు గుమికూడి ఉండటాన్ని గమనించారు. వారిలో మాస్క్ ధరించని యువకుడిని ఆయన మందలించారు. ఈ నేపథ్యంలో, ఇరువురికీ మాటామాట పెరిగి వాగ్వాదానికి దారి తీసింది. అనంతరం యువకుడిపై సదరు కార్పొరేటర్ చేయి చేసుకున్నారు. దీంతో ఆ యువకుడు కార్పొరేటర్ పై తిరగబడ్డాడు. మా అమ్మానాన్నలే నన్ను కొట్టరని... నన్ను కొట్టడానికి నీవెవరంటూ తన స్నేహితులతో కలిసి కార్పొరేటర్ ను కొట్టాడు.

ఆ తర్వాత దాడి గురించి తెలుసుకున్న కార్పొరేటర్ అనుచరులు హాస్టల్ వద్దకు వచ్చి... సదరు యువకులను బయటకు తీసుకొచ్చి దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వచ్చి, యువకులను అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్ కు తరలించారు.