సీఎం కేసీఆర్, ఇతర మంత్రులు వ్యాక్సిన్ ఎందుకు తీసుకోవడంలేదో చెప్పాలి: బండి సంజయ్

28-04-2021 Wed 14:47
  • తెలంగాణలో కరోనా విజృంభణ
  • సీఎం కేసీఆర్ ఇప్పటివరకు సమీక్ష జరపలేదన్న సంజయ్
  • అసెంబ్లీ సాక్షిగా కరోనా గురించి చులకనగా మాట్లాడారని వెల్లడి
  • దాంతో ప్రజలు తేలిగ్గా తీసుకున్నారని వివరణ
Bandi Sanjay asks why CM KCR and ministers does not take vaccine dose till the date
తెలంగాణలో కరోనా పరిస్థితులపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో స్పందించారు. సీఎం కేసీఆర్, ఇతర మంత్రులు ఎందుకు కరోనా వ్యాక్సిన్ తీసుకోవడంలేదో చెప్పాలని నిలదీశారు. ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకోకుండా ప్రజలకు ఎలా నమ్మకం కలిగిస్తారని ప్రశ్నించారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు భరోసా ఇవ్వని ఇలాంటి సీఎం ఉంటే ఏమిటి? లేకపోతే ఏమిటి? అని వ్యాఖ్యానించారు. శాసనసభ వేదికగా సీఎం కేసీఆర్ కరోనా గురించి చాలా తేలిగ్గా తీసివేస్తూ మాట్లాడారని, దాంతో ప్రజలు కూడా ఈ మహమ్మారిని అంతే తేలిగ్గా తీసుకున్నారని బండి సంజయ్ వివరించారు.

రాష్ట్రంలో కరోనా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. ఇప్పటివరకు సీఎం కేసీఆర్ తెలంగాణలో కరోనా పరిస్థితులపై సమీక్ష జరపకపోవడం దారుణమని అన్నారు. కరోనా మరణాలపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.