Jagan: పరీక్షలు నిర్వహించాలో, వద్దో కేంద్రం రాష్ట్రాలకే వదిలేసింది: సీఎం జగన్

  • ఏపీలో పది, ఇంటర్ పరీక్షల నిర్వహణపై విమర్శలు
  • వివరణ ఇచ్చిన సీఎం జగన్
  • విద్యార్థుల భవిష్యత్తే తమకు ముఖ్యమని వెల్లడి
  • కేవలం పాస్ సర్టిఫికెట్లతో ప్రయోజనం ఉండదని వ్యాఖ్యలు
  • వారికి మంచి సంస్థల్లో ఉద్యోగాలు రావన్న సీఎం
  • అందుకే తాము పరీక్షలు జరుపుతున్నట్టు స్పష్టీకరణ
CM Jagan justifies AP Govt decision on Tenth and Inter exams

జగనన్న వసతి దీవెన నిధుల విడుదల సందర్భంగా సీఎం జగన్ పరీక్షల విషయం ప్రస్తావించారు. కరోనా సమయంలో పరీక్షలు నిర్వహించాలా, వద్దా అనే విషయాన్ని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసిందని వెల్లడించారు. పరీక్షల నిర్వహణకు అన్ని రాష్ట్రాల్లో ఒకే విధానం లేదని, అది రాష్ట్రాల విచక్షణకు సంబంధించిన విషయం అని కేంద్రం చెప్పిందని సీఎం జగన్ వివరించారు.  

రాష్ట్రంలో ప్రతి విద్యార్థి భవిష్యత్ కు తమ ప్రభుత్వం భరోసా ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్ సర్టిఫికెట్లపైనే ఆధారపడి ఉంటుందని అన్నారు. పరీక్షలు నిర్వహించని రాష్ట్రాలు అందించే సర్టిఫికెట్లపై కేవలం పాస్ అనే ఉంటుందని, పాస్ సర్టిఫికెట్లతో విద్యార్థులకు మంచి సంస్థల్లో ఉద్యోగాలు వస్తాయా? అని ప్రశ్నించారు. విద్యార్థులకు ఉన్నత భవిష్యత్ ఉండాలనే తాము పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

తాము పది, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తుంటే విమర్శలు చేస్తున్నారని, విపత్కర సమయంలోనూ అగ్గిరాజేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షలు రద్దు చేయాలని చెప్పడం చాలా సులభమైన పనే అని అన్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించడం కష్టతరమైన పనే అని... కష్టమైనా, నష్టమైనా విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని పరీక్షల నిర్వహణలో ముందుకు వెళ్లాలనే నిర్ణయించుకున్నామని ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.

ఏ ఒక్క విద్యార్థి నష్టపోని రీతిలో పరీక్షల నిర్వహణ ఉంటుందని, ఈ విషయంలో ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తున్నామని సీఎం తెలిపారు.

More Telugu News