'ఆచార్య' మళ్లీ సెట్స్ పైకి వెళ్లేది అప్పుడేనట!

28-04-2021 Wed 11:07
  • కరోనా కారణంగా ఆగిన 'ఆచార్య' షూటింగ్
  • కొరటాల మార్కు కథాకథనాలు
  • చిరూ బర్త్ డేకి రిలీజ్ చేసే ఛాన్స్

Acharya shooting restarts in June

చిరంజీవి .. కొరటాల కాంబినేషన్లో 'ఆచార్య' సినిమా రూపొందుతోంది. కాజల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, చరణ్ - పూజా హెగ్డే ప్రత్యేకమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ కి ఏర్పాట్లు జరుగుతూ ఉండగా, కరోనా ప్రభావం ఎక్కువ కావడంతో ఆపేశారు. అంతేకాదు .. సినిమా విడుదల తేదీని కూడా వాయిదా వేశారు. దాంతో ఈ సినిమా షూటింగు తిరిగి ఎప్పుడు మొదలవుతుందా? అని ఆభిమానులంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం .. ఓ పది రోజుల పాటు షూటింగు చేస్తే, షూటింగు పార్టు మొత్తం పూర్తవుతుందట. అందువలన పక్కాగా ప్లాన్ చేసుకుని, జూన్ లో షూటింగును పూర్తి చేయాలని భావిస్తున్నారని అంటున్నారు. మే నెలలో కరోనా ఉధృతి పెరగనుందనే సూచనలు కనిపిస్తూ ఉండటంతోనే జూన్ కి వెళ్లారట. ఆ తరువాత చకచకా షూటింగు పూర్తి చేయనున్నారని చెప్పుకుంటున్నారు. సాధ్యమైనంత వరకూ చిరూ పుట్టినరోజైన ఆగస్టు 22నే ఈ సినిమాను విడుదల చేయవచ్చని అంటున్నారు.