Corona Virus: కరోనాపై నెలకొన్న ఎన్నో సందేహాలకు సమాధానాలు ఇచ్చిన ఐసీఎంఆర్!

  • బీపీ, షుగర్, గుండె జబ్బులుంటే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే
  • దీర్ఘకాల జబ్బులున్నవారు వాడుతున్న మందులను ఆపవద్దు
  • ఇబ్రూఫిన్ వంటి పెయిన్ కిల్లర్స్ కు దూరంగా ఉండాలి
  • శారీరక వ్యాయామం, క్రమం తప్పక ఆహారం తీసుకోవాలి
  • ఇంట్లోని కుటుంబీకులతో కూడా భౌతిక దూరం పాటించాలన్న ఐసీఎంఆర్
ICMR Answers FAQs Over Corona Doubts

ప్రాణాంతక కరోనా వైరస్ రెండో దశ, ఇండియాను తీవ్రంగా బాధిస్తున్న వేళ, ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు ఐసీఎంఆర్ ఓ ప్రత్యేక ప్రకటనను విడుదల చేసింది. ముఖ్యంగా బీపీ, మధుమేహం, గుండె జబ్బులు ఉన్నవారు కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తూ, వారిలో ఉదయించే ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలను వెల్లడించింది.

డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజస్ తదితరాలతో బాధ పడుతున్న వారు, తమలో స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించినా, డాక్టర్లు అంతకు ముందే సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడవచ్చని వెల్లడించింది. డాక్టర్లు చెప్పకుండా తాము వాడుతున్న మందులను ఆపవద్దని సలహా ఇచ్చింది. ఒకవేళ డాక్టర్ ను సంప్రదించే పరిస్థితి లేనప్పుడు, అన్ని రకాల మందులనూ వాడుతుండాలని వెల్లడించింది.

షుగర్ వ్యాధిగ్రస్తుల విషయానికి వస్తే, షుగర్ స్థాయి నియంత్రణలో ఉన్న వారికి పెద్దగా ప్రమాదం ఉండదని, నియంత్రణలో లేని వారు మాత్రం హై రిస్క్ కేటగిరీలో ఉన్నట్టని పేర్కొన్న ఐసీఎంఆర్, అప్పుడు కూడా కొంతమందిలో మాత్రమే కరోనా మరింత ప్రాణాంతకంగా మారుతుందని, మధుమేహం ఉన్నవారు మిగతావారితో పోలిస్తే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. నియమిత ఆహార నియమాలు, వ్యాయామం, యోగా వంటివి వీరిని కూడా మహమ్మారి నుంచి కాపాడతాయని తెలిపింది. డయాబెటిక్ పేషంట్లలో కరోనా తీవ్ర స్థాయికి చేరితే, డాక్టర్ల పర్యవేక్షణ తప్పనిసరని, రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, వాడుతున్న ఔషధాలను మార్చాల్సి వుంటుందని, ఇన్సులిన్ స్థాయిని పెంచాలని ఫ్లూయిడ్స్ తీసుకోవాలని తెలిపింది.

రక్తపోటు అధికంగా ఉండే వారి విషయంలో, అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించిన మీదట, బీపీ ఉన్న వారికి వైరస్ సోకితే, వారు కార్డియాలజిస్ట్ ను కూడా సంప్రదించాలని, వారు రామిప్రిల్, ఎనాలాప్రిల్ వంటి ఏసీఈ ఇన్హిబిటార్స్ తో పాటు, లోసార్టన్, టెల్మిసార్టన్ వంటి యాంజియోటెన్సిన్ రిసెప్టార్ బ్లాకర్ ఔషధాలను వాడాలని ఐసీఎంఆర్ పేర్కొంది. ఈ ఔషధాలు గుండె పనితీరును మెరుగుపరుస్తూ, అధిక రక్తపోటును నియంత్రిస్తాయని తెలిపింది. గుండె సమస్యలు ఉన్న వారు స్వీయ నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించింది.

ఇక కరోనా సోకిన వారు ఇబ్రూఫిన్ వంటి పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం ప్రమాదకరమని హెచ్చరించిన ఐసీఎంఆర్, వీటి వాడకం ద్వారా గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయని, కిడ్నీలు చెడిపోతాయని తెలిపింది. నొప్పితో ఉన్న వారు పారాసెటిమాల్ వంటి సురక్షిత పెయిన్ కిల్లర్ లను వాడవచ్చని సూచించింది. దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వారు పొగ తాగడం, మద్యం సేవించడం వంటి పనులకు దూరంగా ఉండాలని, సాధ్యమైనంత వరకూ ఇంట్లోని కుటుంబీకుల నుంచి ప్రతి ఒక్కరికీ దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలని ఐసీఎంఆర్ సూచించింది.

More Telugu News