నిర్మాతగా మారుతున్న చిరూ కూతురు సుస్మిత!

27-04-2021 Tue 17:48
  • తమిళంలో హిట్ కొట్టిన '8 తొట్టక్కల్'
  • తెలుగు రీమేక్ కి సన్నాహాలు
  • యంగ్ హీరోతో పట్టాలెక్కనున్న ప్రాజెక్టు

Susmitha took Thottakkal remake rights

చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత మంచి కాస్ట్యూమ్ డిజైనర్. అలాంటి సుస్మిత ఇక నిర్మాతగా కూడా మారబోతోంది. ఇప్పటికే ఆమె వెబ్ సిరీస్ ను నిర్మిస్తూ వెళుతోంది. ఇక తెలుగు సినిమాలను కూడా నిర్మించాలనే ఉద్దేశంతో రంగంలోకి దిగినట్టుగా చెబుతున్నారు. ఆ ఉద్దేశంతోనే ఆమె ఓ తమిళ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకుందని అంటున్నారు. ఆ సినిమా పేరే '8 తొట్టక్కల్' (8 బుల్లెట్లు). 2017లో తమిళంలో విడుదలైన ఈ సినిమాలో వెట్రి అనే కొత్త హీరో .. అపర్ణ బాలమురళి నటించారు.


ఇందులో హీరో ఒక పోలీస్ ఆఫీసర్ .. ఒక నేరస్థుడిని పట్టుకునే ప్రయత్నంలో తన రివాల్వర్ పోగొట్టుకుంటాడు. రివాల్వర్ ను దొంగిలించిన వ్యక్తి దానిని వేరేవారికి అమ్మేస్తాడు. పర్యవసానంగా చోటుచేసుకునే సన్నివేశాలతో ఈ కథ నడుస్తుంది. వైవిధ్యభరితమైన మలుపులతో సాగే ఈ థ్రిల్లర్ మూవీని శ్రీ గణేశ్ తెరకెక్కించాడు. ఇప్పుడు ఈ సినిమాను ఒక యంగ్ హీరోతో సుస్మిత తెలుగులో రీమేక్ చెయ్యడానికి సన్నాహాలు చేసుకుంటోందట. నిర్మాతగా ఆమె తొలి సినిమాలో హీరో ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలి.