Eatala Rajendar: కరోనా రోగి చనిపోతే డబ్బుల కోసం ఒత్తిడి చేయొద్దు: ప్రైవేటు ఆసుపత్రులకు ఈటల ఆదేశం

  • కరోనా పరిస్థితులపై ఈటల ప్రెస్ మీట్
  • మృతదేహాన్ని వెంటనే వారి బంధువులకు అప్పగించాలని స్పష్టీకరణ
  • ప్రజలను వేధించవద్దని హితవు
  • సభ్యసమాజం ఇలాంటి పద్ధతులు హర్షించదని వెల్లడి
  • ఆక్సిజన్ పర్యవేక్షణ కోసం ఐఏఎస్ అధికారుల నియామకం
Eatala orders private hospitals do not force people for money

తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కొవిడ్ పరిస్థితులపై మీడియా సమావేశం నిర్వహించారు. నిబంధనల మేరకే ప్రైవేటు ఆసుపత్రులు బిల్లులు వసూలు చేయాలని స్పష్టం చేశారు. కరోనా రోగి చనిపోతే డబ్బుల కోసం ఒత్తిడి చేయకుండా, మొదట మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలని స్పష్టం చేశారు. వ్యాపార దృక్పథంతో ప్రజలను వేధించే పద్ధతులను సభ్య సమాజం హర్షించదని పేర్కొన్నారు.

ప్రభుత్వం ఇచ్చిన జీవోలను, ప్రభుత్వం విధించిన నిబంధనలను కచ్చితంగా పాటించాలని ప్రైవేటు ఆసుపత్రులకు స్పష్టం చేశారు. ఎక్కడైనా ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత ఉంటే ప్రభుత్వమే ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోందని ఈటల వెల్లడించారు. రెమ్ డెసివిర్ లభ్యత లేకుంటే తామే అందించే ఏర్పాటు చేస్తున్నామని, తాము ఇంత గొప్పగా సహకరిస్తున్న పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రులు కనికరం లేకుండా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు.

అయితే అన్ని ప్రైవేటు ఆసుపత్రులు ఇలా చేస్తున్నాయని భావించడంలేదని, కొన్ని ఆసుపత్రులే ఇలాంటి ధోరణులకు పాల్పడుతున్నాయని ఈటల అభిప్రాయపడ్డారు. అవకాశం వచ్చింది కదా... ఇప్పుడే సంపాదించుకుందాం అనే కోణంలో ఆలోచించడం సబబు కాదన్నారు.

తెలంగాణలో ఆక్సిజన్ కొరత లేదని, సైన్యం సాయంతో ఆక్సిజన్ రవాణా చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రానికి రోజుకు 270 టన్నుల ఆక్సిజన్ అవసరం అని, రోజుకు 400 టన్నుల ఆక్సిజన్ వచ్చేలా ఏర్పాటు చేశామని చెప్పారు. ఆక్సిజన్ వ్యవహారాల పర్యవేక్షణకు ఐఏఎస్ అధికారులను నియమించామని మంత్రి వెల్లడించారు.

More Telugu News