Raghu Rama Krishna Raju: సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు

  • ఇటీవల కోర్టులో పిటిషన్ వేసిన రఘురామకృష్ణరాజు
  • పిటిషన్ రిటర్న్ చేసిన సీబీఐ కోర్టు
  • సవరణలతో మళ్లీ దాఖలు చేసిన ఎంపీ
  • తన పిటిషన్ ను స్వీకరించారని వెల్లడి
  • జగన్ కు నోటీసులు పంపుతారని స్పష్టీకరణ
CBI court accepts Raghurama Krishna Raju petition

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తన పార్టీ పెద్దలపై గట్టి పోరాటమే చేస్తున్నారు. సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఆయన ఇటీవల దాఖలు చేసిన బెయిల్ ను సీబీఐ కోర్టు నేడు విచారణకు స్వీకరించింది. ఈ విషయాన్ని రఘురామకృష్ణరాజు స్వయంగా వెల్లడించారు. ఇటీవల తాను నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశానని, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ పిటిషన్ ను తొలుత విచారణకు స్వీకరించలేదని, అయితే తాను కొన్ని సవరణలు చేసిన పిదప ఆ పిటిషన్ ను విచారణకు స్వీకరించడం జరిగిందని రఘురామ వివరించారు.

ఉన్నత పదవుల్లో  ఉన్నప్పటికీ న్యాయస్థానాలకు గౌరవం ఇవ్వాలన్న పాయింట్ ఆధారంగా న్యాయపోరాటం సాగిస్తున్నానని స్పష్టం చేశారు. తన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన క్రమంలో, సీఎం జగన్ కు, సీబీఐకి నోటీసులు జారీ చేస్తారని భావిస్తున్నానని తెలిపారు. జగన్ బెయిల్ రద్దు చేసి, విచారణను వేగవంతం చేయాలన్నది తన అభిమతం అని వెల్లడించారు. బెయిల్ పై బయటున్న జగన్ అక్రమాస్తుల కేసులో సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులు ఇకనైనా తన జోలికి రావడం మానుకోవాలని, వస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని రఘురామ హెచ్చరించారు.

More Telugu News