Election Commission Of India: సెకండ్​ వేవ్​ ఎఫెక్ట్​: ఐదు రాష్ర్టాల ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

EC Bans All Victory Procession Rallies on May 2nd
  • విజయోత్సవ ర్యాలీలపై నిషేధం
  • గెలిచిన అభ్యర్థితో ఇద్దరికి మించి ఉండొద్దని ఆదేశం
  • ఓట్ల లెక్కింపులో కరోనా నియమాలు పాటించాలని సూచన
సెకండ్ వేవ్ లో కరోనా కల్లోలాన్ని దృష్టిలో పెట్టుకుని ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ఫలితాలు మే 2న వెల్లడికానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఫలితాలు వెలువడిన తరువాత పార్టీలు నిర్వహించే విజయోత్సవ ర్యాలీలపై ఈసీ నిషేధం విధించింది.  

ఫలితాల అనంతరం ఎన్నిక సర్టిఫికెట్ ను అందుకునే సందర్భంలో గెలిచిన వ్యక్తితో పాటు ఇద్దరు కన్నా ఎక్కువ మంది ఉండకూడదని స్పష్టం చేసింది. ఓట్ల లెక్కింపులో కరోనా నియమ నిబంధనలను పాటించాలని ఆదేశించింది. ఇప్పటికే అమల్లో ఉన్న మార్గదర్శకాలను అనుసరించాలని సూచించింది. కాగా, కేంద్ర ఎన్నికల సంఘం వల్లే దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని మద్రాస్ హైకోర్టు అక్షింతలు వేసిన సంగతి తెలిసిందే.

రాజకీయ పార్టీలు భారీ ర్యాలీలు చేస్తున్నాయని, వాటిపై ఎలాంటి ఆంక్షలు పెట్టకపోవడం దారుణమని ఆక్షేపించింది. ఎన్నికల సంఘం ఉదాసీనత వల్లే కేసులు పెరిగిపోతున్నాయని మండిపడింది. ఈ నేపథ్యంలోనే ఈసీ తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కొన్ని రోజుల క్రితం బెంగాల్ లో ఎన్నికల ప్రచారానికి సంబంధించి కూడా ఈసీ పలు ఆక్షంలు విధించిన సంగతి తెలిసిందే.
Election Commission Of India
ECI
Procession
Victory Rallies
COVID19
Second Wave

More Telugu News