'ఆచార్య' రిలీజ్ డేట్ వాయిదా

27-04-2021 Tue 10:57
  • అపజయమెరుగని దర్శకుడిగా కొరటాల
  • పోరాట యోధులుగా చిరూ .. చరణ్
  • పరిస్థితులు అనుకూలించాకే విడుదల

Acharya Release Date Postponed

చిరంజీవి కథానాయకుడిగా 'ఆచార్య' సినిమా రూపొందుతోంది. ఇంతవరకూ ఫ్లాప్ అనే మాట వినని కొరటాల శివ రూపొందిస్తూ ఉండటంతో, ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. చిరంజీవి సరసన నాయికగా కాజల్ నటిస్తోంది. ఇక ప్రత్యేక పాత్రల్లో చరణ్ - పూజా హెగ్డే సందడి చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. అయితే ప్రస్తుతం కరోనా ఉధృతంగా ఉండటంతో, షూటింగును వాయిదా వేశారు. చరణ్ పాత్రకి సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్స్ ను చిత్రీకరించవలసి ఉండగా షూటింగును ఆపేశారు.

ఈ సినిమాను మే 13వ తేదీన విడుదల చేయనున్నట్టుగా చాలా రోజుల క్రితమే చెప్పారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా వాయిదా వేస్తున్నట్టుగా కొణిదెల ప్రొడక్షన్స్ నుంచి అధికారిక ట్వీట్ వెలువడింది. ఈ సినిమా విడుదల వాయిదాపడే అవకాశాలు ఉన్నట్టుగా కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. చివరికి అదే జరిగింది. పరిస్థితులు అనుకూలించాక ఈ సినిమాను విడుదల చేస్తామనీ, రిలీజ్ ఎప్పుడనేది త్వరలో తెలియజేస్తామని నిర్మాతలు చెప్పారు. ఈ సినిమాలో ఒకే ఆశయం కోసం కలిసి పోరాడే యోధులుగా చిరంజీవి - చరణ్ కలిసి కనిపించనుండటం, అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించే ప్రధానమైన అంశంగా మారింది.