USA: ఇండియాకు సాయం చేసేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసిన 40 యూఎస్ కంపెనీలు!

  • ఇండియాకు సంఘీభావం తెలిపిన యూఎస్
  • ఈ వారంలో 1000 ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్ల సరఫరా
  • అవసరమైన సాయం చేస్తామన్న డెల్లాయిట్
Special Taskforce in US to Help India

కరోనాతో విలవిల్లాడుతున్న ఇండియాకు సంఘీభావాన్ని తెలుపుతూ, ఆదుకునేందుకు 40 టాప్ అమెరికన్ కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లతో ఓ గ్లోబల్ టాస్క్ ఫోర్స్ ఏర్పడింది. యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ నేతృత్వంలోని యూఎస్ - ఇండియా బిజినెస్ కౌన్సిల్, యూఎస్ - ఇండియా స్ట్రాటజిక్ అండ్ పార్టనర్ షిప్ ఫోరమ్ ల ఆధ్వర్యంలో ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పడింది. ఇందులో భాగంగా సమీప భవిష్యత్తులో 20 వేల ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లను భారత్ కు పంపుతామని డెల్లాయిట్ సీఈఓ పునీత్ రెన్జన్ వెల్లడించారు.

దీంతో పాటు ఔషధాలు, వ్యాక్సిన్, ఆక్సిజన్ తదితర ప్రాణాలు నిలిపే సాయాన్ని అందిస్తామని, మొత్తం కార్యక్రమాన్ని యూఎస్ పబ్లిక్ - ప్రైవేట్ పార్టనర్ షిప్ విభాగం పర్యవేక్షిస్తుందని వెల్లడించారు. అమెరికాలో ఈ విధమైన టాస్క్ ఫోర్స్ ఏర్పడటం ఇదే తొలిసారని యూఎస్ విదేశాంగ మంత్రి టోనీ బ్లింకెన్ వ్యాఖ్యానించారు. ఇండియాను ఆదుకునేందుకు యూఎస్ తనవంతు సాయాన్ని అందిస్తుందని బ్లింకెన్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.

తొలి దశలో భాగంగా ఈ వారంలో 1000, ఆపై సాధ్యమైనంత త్వరగా మరో 11 వేల ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లను ఇండియాకు పంపనున్నట్టు పునీత్ రెన్జన్ తెలిపారు. కనీసం 25 వేల ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లను పంపాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామని ఆయన అన్నారు. ఇండియా, అమెరికాల మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయని గుర్తు చేసిన ఆయన, నరేంద్ర మోదీ, జో బైడెన్ మధ్య ఫోన్ సంభాషణలోనూ ఇదే విషయం ప్రస్తావనకు వచ్చిందని తెలిపారు.

More Telugu News