పవన్ కోసం కథ రెడీ చేస్తున్న 'వకీల్ సాబ్' దర్శకుడు!

27-04-2021 Tue 10:21
  • పవన్ తో దిల్ రాజుకు పెరిగిన సాన్నిహిత్యం
  • ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా
  • కథలపై దర్శకుల కసరత్తు  

Once again Pavan Kalyan work with Venu Sri Ram

పవన్ కల్యాణ్ తో సినిమాను నిర్మించాలనే తన కోరిక నెరవేరడానికి 22 ఏళ్లు పట్టిందని ఇటీవల ఒక వేదికపై దిల్ రాజు అన్నారు. ఆయనతో చేసిన 'వకీల్ సాబ్' ఘన విజయాన్ని సాధించడం తన జీవితంలో మరిచిపోలేని సంఘటనల్లో ఒకటి అని చెప్పారు. ఆ వెంటనే పవన్ కల్యాణ్ కూడా .. దిల్ రాజు నిర్మాణంలో సినిమా చేయడం తన అదృష్టమని తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు. అలా ఆ ఇద్దరి మధ్య ఈ సినిమాతో మరింత సాన్నిహిత్యం పెరిగింది. దాంతో దిల్ రాజు బ్యానర్ పై మరో సినిమా చేయడానికి పవన్ కల్యాణ్ అంగీకరించారు.


పవన్ తో దిల్ రాజు మరో సినిమా చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అడ్వాన్స్ కూడా పవన్ కు చేరిందనే టాక్ వచ్చింది. ఈ సినిమా కోసం మంచి కథను రెడీ చేయమని ఇద్దరు ముగ్గురు దర్శకులతో దిల్ రాజు చెప్పారట. అందులో 'వకీల్ సాబ్' దర్శకుడు వేణు శ్రీరామ్ కూడా ఉన్నాడు. పవన్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందనే  విషయం వేణు శ్రీరామ్ పట్టేశాడు. అందువలన అందుకు తగిన కథను సిద్ధం చేసే పనిలో పడ్డాడట. పవన్ ను ఒప్పించేలా కథపై గట్టిగానే కసరత్తు చేస్తున్నాడని అంటున్నారు. ఆయన ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి.