Ashoka Hotel: కొవిడ్ సోకిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు, అధికారుల కోసం ఫైవ్ స్టార్ హోటల్!

  • కొవిడ్ కేర్ సెంటర్ గా అశోకా హోటల్
  • హోటల్ ను నిర్వహించనున్న ప్రిమస్ హాస్పిటల్
  • పరస్పర అవగాహనతో ఆదాయం షేరింగ్
New Delhi Ashoka Hotel Turned into Covid Care Center

ఢిల్లీ హైకోర్టులో విధులు నిర్వహిస్తున్న న్యాయమూర్తులు, ఇతర అధికారులు, వారి కుటుంబీకులకు కరోనా సోకుతున్న వేళ, ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్ అశోకాను కొవిడ్ కేర్ సెంటర్ గా మారుస్తున్నామని, ఇక్కడి 100 గదుల్లో న్యాయమూర్తులు, ఇతర అధికారులకు కరోనా చికిత్స జరుగుతుందని చాణక్యపురి సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ గీతా గ్రోవర్ వెల్లడించారు. ఈ స్టార్ హోటల్ లో మహమ్మారి సోకిన వారికి చికిత్సను అందిస్తామని తెలిపారు. ఈ హోటల్ లో ప్రిమస్ హాస్పిటల్ కొవిడ్ సెంటర్ ను నిర్వహిస్తుందని స్పష్టం చేశారు.

ఈ హోటల్ లో బయో మెడికల్ వ్యర్థాలుగా మిగిలే వేస్ట్ ను హాస్పిటల్ నిర్వీర్యం చేస్తుందని, హోటల్ ఉద్యోగులందరికీ పీపీఈ కిట్లు, రూముల నిర్వహణకు అవసరమైన కనీస శిక్షణను ప్రిమస్ అందిస్తుందని గీతా గ్రోవర్ తన ఆదేశాల్లో వెల్లడించారు. కరోనా భయంతో హోటల్ ఉద్యోగులు ఎవరైనా గైర్హాజరు అయితే, ఆసుపత్రే కొత్త ఉద్యోగులను సమకూరుస్తుందని, రూములు, హౌస్ కీపింగ్, డిజిన్ఫెక్షన్, ఆహార సరఫరా వంటివి హోటల్ యాజమాన్యం పర్యవేక్షణలో ఉంటాయని ప్రకటించారు.

రోగులకు అవసరమయ్యే చికిత్సకు సంబంధించిన చార్జీలను ఆసుపత్రి వసూలు చేస్తుందని, ఆపై హోటల్ యాజమాన్యానికి చెల్లిస్తుందని, ఇదే సమయంలో డాక్టర్లు, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది తమ ఖర్చులపైనే హోటల్ గదుల రేట్ల మేరకు అక్కడే బస ఏర్పాటు చేయాలని, పరస్పర అవగాహనతో డబ్బులు చెల్లిస్తుందని కూడా ఈ ఆదేశాలు వెల్లడించాయి.

కాగా, దేశ రాజధానిలో గత కొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. రోగులకు అవసరమైన ఆక్సిజన్ సరఫరాకు సైతం అవాంతరాలు ఏర్పడ్డాయి. పలు ఆసుపత్రులు, రోగులు తమకు వెంటనే ఆక్సిజన్ కావాలంటూ సామాజిక మాధ్యమాల్లో వేడుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఢిల్లీ హైకోర్టు సైతం విచారణకు స్వీకరించి, తక్షణ చర్యలు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

  • Loading...

More Telugu News