కొత్త దర్శకుడితో ఆనంద్ దేవరకొండ!

26-04-2021 Mon 18:09
  • 'దొరసాని'తో మంచి గుర్తింపు
  • సెట్స్ పై 'పుష్పక విమానం'
  • జూన్ నుంచి మరో సినిమా షూటింగ్  

Anand Devarakonda with new director

విజయ్ దేవరకొండ సోదరుడిగా తెలుగు తెరకి ఆనంద్ దేవరకొండ పరిచయమయ్యాడు. తొలి సినిమా 'దొరసాని'లో చాలా సహజంగా నటించాడు. ఓ పేద కుర్రాడు దొర కూతురును ప్రేమిస్తే ఎలాంటి భావాలకు లోనవుతాడనే సన్నివేశాల్లో ఆయన నటన అందరినీ ఆకట్టుకుంది. ఆ తరువాత ఆనంద్ దేవరకొండ చేసిన 'మిడిల్ క్లాస్ మెలోడీస్' కూడా ప్రేక్షకులను మెప్పించింది. పాత్రని దాటిపోని నటనతో ఆనంద్ దేవరకొండ అభిమానులను సంపాదించుకుంటున్నాడు. అలాంటి ఆయన వరుసగా కథలను వింటూ .. తనకి నచ్చిన ప్రాజెక్టులను ఓకే చేసుకుంటూ వెళుతున్నాడు.


ప్రస్తుతం 'పుష్పక విమానం' అనే సినిమా చేస్తున్న ఆనంద్ దేవరకొండ, రఘు అనే కొత్త దర్శకుడితో మరో సినిమాను చేయనున్నట్టు తెలుస్తోంది. రఘు అనే కొత్త కుర్రాడు ఇటీవల ఆనంద్ దేవరకొండను కలిసి ఒక కాన్సెప్ట్ బేస్డ్ స్టోరీ చెప్పాడట. ఆనంద్ దేవరకొండకి చాలా కొత్తగా అనిపించడంతో, వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించే దిశగా పనులు జరుగుతున్నాయని చెబుతున్నారు. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కావడం ఖాయమనే టాక్ కూడా వినిపిస్తోంది. మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.