Kodali Nani: నారా లోకేశ్ పై కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు!

  • హైదరాబాదులో కూర్చొని ట్వీట్లు చేయడం లోకేశ్ కు అలవాటు
  • వార్డు మెంబర్ గా కూడా గెలవలేని లోకేశ్ కు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు
  • లోకేశ్ వ్యాఖ్యలను మేము పట్టించుకోము
Kodali Nani fires on Nara Lokesh

ఏపీలో ఆక్సిజన్ అందక కరోనా రోగులు మృతి చెందుతున్నారంటూ వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా ముఖ్యమంత్రి జగన్ కు పట్టింపులేదని ఆయన మండిపడ్డారు. కరోనా కోరలు చాస్తున్న తరుణంలో విద్యార్థులకు పరీక్షలను నిర్వహిస్తామని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో లోకేశ్ పై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

వాస్తవ పరిస్థితులను తెలుసుకోకుండా హైదరాబాదులో కూర్చొని లోకేశ్ మాట్లాడుతున్నారని కొడాలి నాని విమర్శించారు. లోకేశ్ ఒక పనికిమాలిన వ్యక్తి అని... హైదరాబాదు నుంచి ట్వీట్లు చేయడం ఆయనకు అలవాటని దుయ్యబట్టారు. బాధ్యత కలిగిన ప్రజా ప్రతినిధో, అధికారులో ప్రశ్నిస్తే సమాధానం చెప్పొచ్చని... లోకేశ్ లాంటి వ్యక్తికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. వార్డు మెంబర్ గా కూడా గెలవలేని లోకేశ్ మాట్లాడితే తాము పట్టించుకోబోమని తెలిపారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ లో తయారయ్యే 170 టన్నుల మెడికల్ ఆక్సిజన్ లో 100 టన్నులు ఏపీకే అందుతోందని కొడాలి నాని చెప్పారు. మిగిలిన ఆక్సిజన్ మహారాష్ట్రకు పంపిణీ అవుతోందని తెలిపారు. విజయవాడలోని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత ఉందనే ఆరోపణలను ఆయన ఖండించారు.

More Telugu News