Pat Cummins: పీఎం కేర్స్ ఫండ్ కు 50 వేల డాలర్లు విరాళం ప్రకటించిన ఆస్ట్రేలియా క్రికెటర్ ప్యాట్ కమిన్స్

Australian cricketer Pat Cummins donates to PM Cares Fund
  • భారత్ లో దుర్భర పరిస్థితులు
  • కోరలు చాస్తున్న కరోనా రాకాసి
  • చలించిపోయిన ప్యాట్ కమిన్స్
  • ఇతరులు కూడా విరాళాలు ఇవ్వాలని పిలుపు
  • తమ విరాళాలు ఏ కొందరికి ఉపయోగపడినా అదే చాలన్న కమిన్స్
భారత్ లో కొవిడ్ విజృంభిస్తున్న తీరు పట్ల అంతర్జాతీయస్థాయిలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా, ఆక్సిజన్ కు ఏర్పడిన డిమాండ్ అంతకంతకు పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెటర్ ప్యాట్ కమిన్స్ భారత్ లో ప్రస్తుత పరిస్థితుల పట్ల చలించిపోయాడు. తనవంతుగా పీఎం కేర్స్ ఫండ్ కు 50 వేల డాలర్ల విరాళం ప్రకటించాడు. ప్యాట్ కమిన్స్ ప్రస్తుతం ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. విరాళం ప్రకటిస్తున్నట్టు కమిన్స్ ఓ ప్రకటనలో తెలిపాడు.

"అనేక సంవత్సరాలుగా భారత్ రావడాన్ని ఎంతో ప్రేమిస్తున్నాను. ఇక్కడివాళ్లు ఎంతో సహృదయులు. ఇంత మంచివాళ్లను నేనెప్పుడూ చూడలేదు. కానీ వీళ్లు ప్రస్తుతం అనుభవిస్తున్న వేదన చూసిన తర్వాత నేను తీవ్రంగా విచారిస్తున్నాను. అయితే భారత్ లో కరోనా విలయతాండవం చేస్తున్న పరిస్థితుల్లో ఐపీఎల్ కొనసాగించడం సమంజసమేనా అనే చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో నేను చెప్పేది ఏంటంటే.... కఠిన లాక్ డౌన్ తరహా ఆంక్షల నడుమ ప్రజలకు ఐపీఎల్ కొద్దిపాటి ఉపశమనం కలిగిస్తుందన్న కోణంలో భారత ప్రభుత్వం ఆలోచిస్తుందని భావిస్తున్నాను.

ఇక ఆటగాళ్లుగా మేం ఐపీఎల్ ద్వారా కోట్లాది మందికి చేరువ అవుతున్నాం. ఈ ప్రజాదరణను మేం మంచిపనుల దిశగానూ ఉపయోగించుకోవాలి. ఆ ఆలోచనతోనే పీఎం కేర్స్ ఫండ్ కు 50 వేల డాలర్లు విరాళంగా ప్రకటిస్తున్నాను. ముఖ్యంగా, దేశంలో ఆక్సిజన్ సరఫరా ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో నా విరాళాన్ని ఆ దిశగా ఉపయోగించాలని కోరుకుంటున్నా. భారత్ తపన, ఔదార్యం పట్ల ప్రభావితులైన ఐపీఎల్ లోని ఇతర ఆటగాళ్లు, ఇతరులు కూడా విరివిగా విరాళాలు ఇవ్వాలని ప్రోత్సహిస్తున్నా.

కరోనాతో కన్నుమూసినవారి పట్ల ఎంతో బాధపడుతున్నా. ప్రస్తుత పరిస్థితుల్లో నిస్సహాయంగా మిగిలిపోతున్న వారి పట్ల వ్యక్తమయ్యే భావోద్వేగాలను కార్యరూపం దాల్చేలా చేసి, బాధితుల జీవితాల్లో వెలుగులు నింపాలి. నేనిస్తున్న విరాళం ఏమంత పెద్దది కాదని తెలుసు కానీ, అది ఏ కొందరికైనా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను" అంటూ కమిన్స్ తన ప్రకటనలో పేర్కొన్నాడు.
Pat Cummins
PM Cares Fund
India
Donation
Covid Pandemic
IPL
Australia
Cricket

More Telugu News