Alla Nani: ప్రతి నియోజకవర్గంలో ఒక కొవిడ్ సెంటర్: గుంటూరు జిల్లాలో మంత్రి ఆళ్ల నాని సమీక్ష

AP Health Minister Alla Nani review in Guntur district
  • గుంటూరు జిల్లా కలెక్టరేట్ లో సమావేశం
  • హాజరైన ఆళ్ల నాని, మేకతోటి సుచరిత
  • కొవిడ్ సెంటర్లుగా 40 బెడ్లు ఉన్న ఆసుపత్రులు
  • ఆక్సిజన్ వృథా కాకుండా చర్యలు తీసుకోవాలన్న ఆళ్ల నాని
  • రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లకు కొరతలేదని స్పష్టీకరణ
రాష్ట్ర సర్కారు గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కరోనా పరిస్థితులపై సమీక్ష సమావేశం నిర్వహించింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి హోంమంత్రి మేకతోటి సుచరిత, గుంటూరు జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జిల్లా ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ, ప్రతి నియోజకవర్గంలో ఒక కొవిడ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 40 పడకలు ఉన్న ఆసుపత్రులను కొవిడ్ సెంటర్లుగా మార్చుతామని తెలిపారు.

కరోనా రోగుల ప్రైమరీ కాంటాక్ట్ గా గుర్తించిన వారందరికీ పరీక్షలు జరపాలని అధికారులకు స్పష్టం చేశారు. కరోనా పరీక్షల రిపోర్టులు 24 గంటల్లోగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 104 సేవలను మరింత సమర్థవంతంగా అందించాలని, ఫోన్ చేసిన 3 గంటల్లో బెడ్ కేటాయించే విధంగా చర్యలు ఉండాలని నిర్దేశించారు.

ప్రస్తుతం ఆక్సిజన్ కు ఏర్పడిన ప్రాధాన్యత దృష్ట్యా ప్రాణవాయువు వృథా కానివ్వరాదని, దీనిపై వైద్యాధికారులు దృష్టి సారించాలని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లకు కొరత లేదని, ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.
Alla Nani
Review
Guntur District
Covid
Andhra Pradesh

More Telugu News