America: కొవిషీల్డ్‌ తయారీకి కావాల్సిన ముడి పదార్థాలను భారత్‌కు పంపుతాం: అమెరికా

  • అమెరికాలో అమల్లో ఉన్న రక్షణ ఉత్పత్తుల చట్టం
  • దీంతో  వ్యాక్సిన్‌ ముడిపదార్థాల ఎగుమతిపై నిషేధం
  • భారత్‌కు సాయం చేయాలని బైడెన్ పై ఒత్తిడి
  • ఎట్టకేలకు ముడిపదార్థాలను పంపేందుకు అంగీకరించిన అమెరికా
Will send raw material required to produce covishield says america

కరోనా టీకా కొవిషీల్డ్‌ తయారీలో అవసరమయ్యే ముడి పదార్థాలను తక్షణమే భారత్‌కు పంపుతామని అమెరికా ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు(ఎఫ్‌ఎస్‌ఏ) జేక్‌ సలీవన్‌ భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌కు తెలియజేశారు. ఇప్పటి వరకు వీటి ఎగుమతులపై అమెరికాలో నిషేధం ఉన్న విషయం తెలిసిందే. అలాగే, వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు, నిర్ధారణ పరీక్షల కిట్లు, ఆక్సిజన్‌ ప్లాంట్లు-సంబంధిత పరికరాలనూ పంపేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపింది.

అయితే, నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ) సీఈఓ అదర్‌ పూనావాలా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఇటీవల విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన బైడెన్‌ ప్రభుత్వం.. భారత ఔషధాల్ని అర్థం చేసుకోగలమని వ్యాఖ్యానించింది. భారత్‌కు కావాల్సిన ముడిపదార్థాలను పంపే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని ప్రకటించింది. తాజాగా అందుకు  అంగీకరిస్తూ నిర్ణయం తీసుకుంది.

అమెరికాలో ‘రక్షణ ఉత్పత్తుల చట్టం’ అమల్లో ఉండడంతో టీకా తయారీకి కావాల్సిన ముడిపదార్థాలపై నిషేధం కొనసాగింది. దీంతో అది ఇక్కడ టీకా తయారీకి పెద్ద అడ్డంకిగా మారింది. తాజాగా కొవిడ్‌ ప్రమాదకర స్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్‌కు సాయం చేయాలన్న డిమాండ్‌ పెరిగింది. ఈ మేరకు వివిధ వర్గాలు బైడెన్‌పై ఒత్తిడి పెంచాయి. ఈ తరుణంలో అమెరికా తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

More Telugu News