Corona Virus: కరోనా ఉన్నా ఓటు వేయండి.. బెంగాల్‌ ఓటర్లకు మమత పిలుపు

Dont worry about corona go and vote calls mamata to bengal people
  • ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ను కోరిన మమత 
  • బీజేపీ, మోదీపై తీవ్ర విమర్శలు
  • ప్రధాని ప్రసంగాలకే పరిమితమవుతారని విమర్శ
  • ‘ఒకే దేశం ఒకే టీకా ధర’ ఎందుకు లేదని ప్రశ్న
తదుపరి విడతల ఓటింగ్‌లో కరోనా బాధితులు సైతం ఓటు హక్కు వినియోగించుకోవాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. అందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని కోరారు. నేడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల వర్చువల్‌ ప్రచార కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మోదీ కేవలం ప్రసంగాలకే పరిమితమవుతారని ఆరోపించారు. ఇప్పటి వరకు వ్యాక్సిన్‌ ఇవ్వడంపై దృష్టి సారించి ఉంటే మహమ్మారి ప్రభావం గణనీయంగా తగ్గేదన్నారు. కేంద్రాన్ని సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం కేవలం బెంగాల్‌కు మాత్రమే ఉందని దీదీ అన్నారు. అందుకే యావత్తు దేశం ఇక్కడి ఎన్నికలపై దృష్టి సారించిందన్నారు. ప్రచార కార్యక్రమాల కంటే ఎక్కువ తాను కరోనా సమీక్షా సమావేశాలే నిర్వహిస్తున్నానని తెలిపారు.  

ఉత్తర్‌ప్రదేశ్‌, అసోంలో శ్మశానంలోనూ గోడలు నిర్మించారని దీదీ తెలిపారు. బెంగాల్‌లో మాత్రం అలాంటి విభజన లేదని చెప్పుకొచ్చారు. యూపీ, అసోంలో బీజేపీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. బెంగాల్‌లో కొవిడ్‌ బాధితుల కోసం ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా 60 శాతం పడకలు కేటాయించాలని ఆదేశించినట్లు తెలిపారు. ‘ఒకే దేశం.. ఒకే నాయకుడు’ అన్న నినాదంతో ముందుకెళ్తున్న మోదీ టీకాకు మాత్రం ఒకే ధర ఎందుకు నిర్ణయించలేదని ప్రశ్నించారు.
Corona Virus
COVID19
West Bengal
Mamata Banerjee
BJP
MODI
TMC

More Telugu News