Chennai Super Kings: జడేజా ఆల్ రౌండ్ షో... బెంగళూరుకు తొలి ఓటమి రుచి చూపిన చెన్నై సూపర్ కింగ్స్

Chennai Super Kings beat Royal Challengers Baglore
  • 69 పరుగులతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం
  • తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై
  • 20 ఓవర్లలో 4 వికెట్లకు 191 రన్స్
  • బ్యాటింగ్ లో 62 పరుగులు చేసిన జడేజా
  • లక్ష్యఛేదనలో బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లకు 122 రన్స్
  • 4 ఓవర్లలో 3 వికెట్లు తీసిన జడేజా
టోర్నీలో వరుసగా 4 విజయాలు సాధించి ఓటమన్నదే లేకుండా వచ్చిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ చిత్తుగా ఓడించింది. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మరోసారి తనదైన శైలిలో అటు బ్యాటింగ్ లోనూ, ఇటు బౌలింగ్ లోనూ విజృంభించి చెన్నై జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. జడేజా హవా సాగిన ఈ మ్యాచ్ లో చెన్నై జట్టు 69 పరుగుల తేడాతో బెంగళూరును ఓడించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 191 పరుగులు చేసింది. చివర్లో రవీంద్ర జడేజా మెరుపు ఇన్నింగ్స్ ఆడడం హైలైట్. జడేజా 28 బంతుల్లో 5 సిక్సులు, 4 ఫోర్లతో 62 పరుగులతో అజేయంగా నిలిచాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన బెంగళూరుకు ఏదీ కలిసిరాలేదు. చివరికి 20 ఓవర్లలో 9 వికెట్లకు 122 పరుగులు చేసింది. బ్యాట్ తో రాణించిన జడేజా బంతితోనూ విజృంభించడం బెంగళూరుకు కష్టాలు తెచ్చిపెట్టింది. జడేజా 4 ఓవర్లు విసిరి కేవలం 13 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఓ మెయిడెన్ ఓవర్ కూడా విసిరాడు. తాహిర్ 2, శామ్ కరన్ 1, శార్దూల్ ఠాకూర్ 1 వికెట్ తీశారు.

బెంగళూరు ఇన్నింగ్స్ లో ఓపెనర్ దేవదత్ పడిక్కల్ టాప్ స్కోరర్. పడిక్కల్ 15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 34 పరుగులు చేశాడు. గ్లెన్ మ్యాక్స్ వెల్ 22 పరుగులు సాధించాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ (8), ఏబీ డివిలియర్స్ (4) విఫలం కావడం బెంగళూరు ఇన్నింగ్స్ పై తీవ్ర ప్రభావం చూపింది.

ఇక, నేడు జరిగే రెండో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు సారథి రిషబ్ పంత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కరోనా నుంచి కోలుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అక్షర్ పటేల్ నేటి మ్యాచ్ లో ఆడుతున్నాడు. సన్ రైజర్స్ జట్టులో భువనేశ్వర్ కుమార్ స్థానంలో సుచిత్ ను తీసుకున్నారు.
Chennai Super Kings
Royal Challengers Baglore
Defeat

More Telugu News