COVID19: మహమ్మారితో పోరులోనూ ముందున్న సైన్యం.. 97 శాతం మందికి టీకాలు

  • రెండో డోసు వేసుకున్న 76 శాతం మంది
  • ఆర్మీలో 99 శాతం మందికి వ్యాక్సిన్
  • వాయుసేన, నావికాదళాల్లో 100కు వంద శాతం
  • సైనిక సిబ్బంది కుటుంబాలకూ టీకాలు
Indian Armed Forces Vaccinated 100 percent for their personnel

పొరుగు దేశాల శత్రువులతోనే కాదు.. కంటికి కనిపించని శత్రువు కరోనా మహమ్మారితో పోరులోనూ సైన్యం తన స్ఫూర్తిని చాటింది. దేశవ్యాప్తంగా 97 శాతం మందికి ఫస్ట్ డోస్, 76 శాతం మందికి సెకండ్ డోస్ ఇచ్చినట్టు రక్షణ శాఖ ప్రతినిధులు వెల్లడించారు.


త్రివిధ దళాలు కలిపి మొత్తంగా 15.5 లక్షల మంది సైనికులు పస్ట్ డోస్ టీకాను తీసుకున్నారని, సైన్యంలోని లక్ష మంది ఆరోగ్య సిబ్బందీ వ్యాక్సిన్ తీసుకున్నారని తెలిపారు. 11.7 లక్షల మంది సైనికులు సెకండ్ డోస్ కూడా తీసుకున్నారని, 90 వేల మంది ఆరోగ్య సిబ్బందీ సెకండ్ డోస్ వేయించుకున్నారని స్పష్టం చేశారు.

సైన్యంలో ఇదీ టీకాల లెక్క...

  • ఆర్మీలోని 13 లక్షల మంది సిబ్బందికిగానూ 99 శాతం మంది టీకా తీసుకున్నారు. 82 శాతం మంది రెండో డోసు వేసుకున్నారు.
  • భారత వైమానిక దళంలో 2 లక్షల మంది వ్యాక్సిన్ వేసుకున్నారు. అందులో 90 శాతం మంది రెండు డోసులూ తీసుకున్నారు. మరో 10 శాతం మందికి రెండో డోసు వేయాల్సి ఉంది.
  • నావికా దళంలోనూ వంద శాతం వ్యాక్సినేషన్ జరిగింది. 70 శాతం మంది సెకండ్ డోస్ కూడా వేసుకున్నారు. మొత్తం లక్ష మంది సిబ్బంది నావికాదళంలో పనిచేస్తున్నారు.
  • త్రివిధ దళాల్లోనూ కొవిషీల్డ్ వ్యాక్సిన్ నే వేస్తున్నారు.
  • సైనిక సిబ్బంది కుటుంబ సభ్యులకూ సర్వీస్ ఆసుపత్రుల్లో టీకాలు వేస్తున్నారు. 45 ఏళ్లు దాటిన అర్హులందరికీ వ్యాక్సిన్ ఇస్తున్నారు.
  • మాజీ సైనికులకూ ఆర్మీ వ్యాక్సిన్ వేస్తోంది. ఇప్పటిదాకా త్రివిధదళాలు, బీఆర్వో (సరిహద్దు రహదారుల నిర్వహణ సంస్థ), తీర రక్షక దళాలు కలిపి 44 వేల మంది కరోనా బారిన పడ్డారు. 150 మంది చనిపోయారు.  

More Telugu News