New Delhi: తప్పట్లేదు.. పేషెంట్లను చేర్చుకోలేం: ఢిల్లీ ప్రముఖ ఆసుపత్రి ప్రకటన

  • ఆక్సిజన్ కొరతతో అడ్మిషన్లు బంద్
  • నిన్న అర్ధరాత్రే ఆసుపత్రికి ఆక్సిజన్
  • ఇవ్వాళ మధ్యాహ్నానికి ప్రాణవాయువు అయిపోయే చాన్స్
  • అధికారులకు ముందు నుంచే చెబుతున్నామని వెల్లడి
Delhi Hospital Stops Admissions Amid Shortage Of Oxygen

ఢిల్లీలో ఆక్సిజన్ కొరత ఎంత తీవ్రంగా ఉందో చెప్పే ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశంలోని అత్యున్నత ఆసుపత్రుల్లో ఒకటైన ఫోర్టిస్ ఎస్కార్ట్ లోనూ ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో కొత్తగా వచ్చే పేషెంట్లను ఆసుపత్రి చేర్చుకోవట్లేదు. కొత్త అడ్మిషన్లకు సంబంధించి ఆసుపత్రి ఆవరణలోనే ఓ పెద్ద నోటీస్ బోర్డునూ ఏర్పాటు చేసింది. ఢిల్లీలో కేసులు పెరిగిపోతుండడంతో ఆక్సిజన్ కొరత వేధిస్తోందని, తప్పనిసరి పరిస్థితుల్లోనే రోగులను చేర్చుకోవట్లేదని ఫోర్టిస్ ప్రకటించింది.


‘‘ఆసుపత్రిలో పరిస్థితి గురించి ముందు నుంచే అధికారులకు చెబుతూ వచ్చాం. అయితే, ఆక్సిజన్ అందిస్తామంటూ హామీ ఇచ్చారు. అయితే, మా కోటా కోసం నిన్నటి నుంచి వేచి చూడాల్సిన పరిస్థితి. ఇవ్వాళ మధ్యాహ్నానికి హాస్పిటల్ లో ఆక్సిజన్ అయిపోతుంది. దీంతో విధి లేని పరిస్థితుల్లో కొత్తగా వచ్చే వారికి అడ్మిషన్లు ఇవ్వట్లేదు. పరిస్థితి మామూలయ్యేదాకా అత్యవసర సేవలనూ ఒప్పుకోలేని పరిస్థితి. ఇప్పటికే ఉన్న ఇన్ పేషెంట్లకు మావల్ల అయిందంతా చేస్తున్నాం’’ అని నోటీస్ లో పేర్కొంది.

శనివారం అర్ధరాత్రి ఒంటి గంటకు ఆక్సిజన్ స్టాక్ వచ్చిందని, అది ఆదివారం మధ్యాహ్నానికే అయిపోతుందని ఆసుపత్రి ప్రతినిధి చెబుతున్నారు. ప్రస్తుతం వంద మంది పేషెంట్లు ఆక్సిజన్ పై ఉన్నారని చెప్పారు.

More Telugu News