Lockdown: రానున్నది లాక్ డౌన్ ల పొడిగింపుల కాలం!

  • ఇప్పటికే రాత్రి కర్ఫ్యూను అమలు చేస్తున్న పలు రాష్ట్రాలు
  • మహారాష్ట్రంలో వారం పాటు పూర్తి లాక్ డౌన్
  • నిబంధనల అమలు సమయాన్ని పొడిగించనున్న ఢిల్లీ ప్రభుత్వం
  • అదే దారిలో మిగతా రాష్ట్రాలు కూడా
States Think Lockdown Extenssions

నానాటికీ పెరుగుతున్న కరోనా కేసులను నియంత్రించేందుకు దేశంలోని పలు రాష్ట్రాలు ఇప్పటికే వారాంతపు లాక్ డౌన్ లు, నైట్ కర్ఫ్యూలు అమలు చేస్తున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ ను అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే పాక్షిక లాక్ డౌన్ ను అమలు చేస్తున్న రాష్ట్రాల్లో ఇంకా కేసులు తగ్గక పోవడంతో పలు రాష్ట్రాలు నిబంధనల అమలు సమయాన్ని పొడిగించే యోచనగా అడుగులు వేస్తున్నాయి.

ఇప్పటికే ఢిల్లీలో కఠిన ఆంక్షలను అమలు చేస్తున్న ఆప్ సర్కారు, కేసుల సంఖ్య ఏ మాత్రమూ తగ్గకపోవడంతో నిబంధనల అమలును మరో వారం పాటు కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. తాజాగా, ఒక రోజు వ్యవధిలో 24 వేలకు పైగా కొత్త కేసులు రావడంతో పాటు టెస్ట్ పాజిటివిటీ రేటు 32.27 శాతంకు పెరగడం, 257 మంది మరణించడంతో కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అధారిటీ నుంచి నేడు ఉత్తర్వులు వెలువడనున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి.

గత వారంలో ప్రభుత్వం ఆరు రోజుల లాక్ డౌన్ ను ప్రకటించగా, అది రేపటితో ముగియనుంది. ప్రజల క్షేమమే తమకు అత్యంత ముఖ్యమైన అంశమని, అందుకోసం కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకోక తప్పేలా లేదని సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక మహారాష్ట్ర కూడా ఇదే తరహా ఆలోచనలో ఉంది. ఇప్పటివరకూ పాక్షిక లాక్ డౌన్ లను అమలు చేస్తూ వస్తున్న ఉద్ధవ్ సర్కారు, పూర్తి లాక్ డౌన్ ను ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

తెలంగాణలో అమలు చేస్తున్న నైట్ కర్ఫ్యూ ఇప్పటికే నాలుగవ రోజుకు చేరింది. ఈ నెల 30తో నైట్ కర్ఫ్యూ ముగియాల్సి వుండగా, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నిబంధనల అమలును పొడిగించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఏపీతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. కేసుల సంఖ్య మరింతగా పెరిగితే, ఐదు దశల అన్ లాక్ రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు వ్యాఖ్యానించాయి.

More Telugu News