Switzerland: స్విట్జర్లాండ్ ను తాకిన భారత కరోనా వేరియంట్!

  • ఇండియాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్
  • యూరప్ మీదుగా స్విస్ కు వెళ్లిన ఓ వ్యక్తి
  • విమానాల రద్దుపై యోచిస్తున్నామన్న అధికారులు
Indian Varient Found in Swiss

ఇండియాలో వెలుగుచూసి, ప్రమాదకరంగా మారిన కరోనా కొత్త వేరియంట్, స్విట్జర్లాండ్ వరకూ పాకింది. ఈ విషయాన్ని అక్కడి ప్రజారోగ్య విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. తమ దేశానికి ఇండియన్ వేరియంట్ వ్యాపించిందని అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఫెడరల్ ఆఫీస్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పేర్కొంది. ఓ ప్రయాణికుడు యూరప్ లోని విమానాశ్రయం నుంచి స్విట్జర్లాండ్ కు వచ్చాడని, అతనిలో ఈ వేరియంట్ ను కనుగొన్నామని తెలిపింది,.

స్విట్జర్లాండ్ కు వచ్చే ముందు అతను రెండు విమానాలను మారాడని, సోలోథమ్ లో అతని నమూనాలను సేకరించగా, పాజిటివ్ వచ్చిందని ఆరోగ్య శాఖ ప్రతినిధి డేనియల్ దౌవాల్డర్ వెల్లడించారు. కాగా, ఇండియా నుంచి వచ్చిన 20 మంది నర్సింగ్ విద్యార్థులకు పాజిటివ్ వచ్చిందని బెల్జియం అధికారులు ప్రకటించిన రెండు రోజుల వ్యవధిలోనే స్విట్జర్లాండ్ కూడా ఇండియన్ వేరియంట్ తమ దేశంలోకి వచ్చిందని ప్రకటించడం గమనార్హం. బి.1.617 పేరిట ఉన్న ఈ డబుల్ మ్యూటెంట్ వేరియంట్ ఇండియాలో శరవేగంగా వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ వేరియంట్ సోకిన వారికి కృత్రిమంగా ప్రాణవాయువును అందించడం తప్పనిసరి అవుతుండగా, ఇండియాలో ఆక్సిజన్ కు తీవ్ర కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ దేశంలో కరోనా వైరస్ కారణంగా 1.90 లక్షల మందికి పైగా మరణించారు. ఇండియన్ మ్యూటెంట్ ప్రమాదాన్ని గుర్తించిన పలు దేశాలు ఇప్పటికే భారత్ నుంచి వచ్చే విమానాలను రద్దు చేశాయి. ఇదే విషయాన్ని ప్రస్తావించిన స్విట్జర్లాండ్ అధికారులు, ఇండియన్ విమానాలను రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు,. రెడ్ లిస్ట్ లో ఉన్నదేశాల నుంచి స్విట్జర్లాండ్ వచ్చే వారికి 10 రోజుల క్వారంటైన్ ను తప్పనిసరి చేశామని వెల్లడించారు.

More Telugu News