తేజ దర్శకత్వంలో రానా బ్రదర్ అభిరామ్!

24-04-2021 Sat 18:27
  • కొత్త హీరోలను పరిచయం చేసిన తేజ
  • ఆయన దర్శకత్వంలో రానాకు మంచి హిట్
  • అభిరామ్ సినిమాతో ఆర్పీ పట్నాయక్ రీ ఎంట్రీ  
Teja introduces Rana brother Abhiram

వెంకటేశ్ .. రానా తరువాత దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి ఇప్పుడు మరో హీరో రానున్నాడు. అతనే రానా తమ్ముడు .. అభిరామ్. చాలా రోజుల క్రితమే హీరోగా అభిరామ్ ఎంట్రీ ఇవ్వనున్నాడనే వార్తలు వచ్చాయి. దర్శకులుగా వంశీ .. తరుణ్ భాస్కర్ .. రవిబాబు పేర్లు వినిపించాయి. కానీ ఆ ప్రాజెక్టులేవీ పట్టాలెక్కలేదు. అభిరామ్ ను హీరోగా పరిచయం చేసే బాధ్యత తేజకు అప్పగించబడిందనే వార్తలు బలంగానే వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సన్నాహాలు ఆల్రెడీ మొదలైపోయాయని అంటున్నారు.


సురేశ్ ప్రొడక్షన్స్ వారితో తేజకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రానాతో ఆయన చేసిన 'నేనే రాజు నేనే మంత్రి' భారీ విజయాన్ని సాధించింది. అందువల్లనే సురేశ్ బాబు ..  తేజ చేతిలో అభిరామ్ ను పెట్టాడని అంటున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు ద్వారానే తాను సంగీత దర్శకుడిగా రీ ఎంట్రీ ఇస్తున్నట్టుగా చెప్పారు. అందువలన ఈ ప్రాజెక్టు ఖాయమైపోయిందని తెలుస్తోంది. ఉదయ్ కిరణ్ .. నితిన్ .. నవదీప్ ను హీరోలుగా తెరకి పరిచయం చేసిన తేజ, అభిరామ్ ను ఎలా చూపిస్తాడో చూడాలి.