Ayyanna Patrudu: అదేనా ధూళిపాళ్ల చేసిన తప్పు?: సర్కారుపై అయ్యన్నపాత్రుడు ఆగ్రహం

  • సంగం డెయిరీ వ్యవహారంలో ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్
  • నోటీసులు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారన్న అయ్యన్న
  • ఉన్మాద సీఎం అంటూ వ్యాఖ్యలు
  • ఏసీబీ, సీఐడీ స్వతంత్ర సంస్థల్లా మెలగాలని హితవు
Ayyanna Patrudu fires on YCP Govt over Dhulipalla Narendra arrest

సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆ డెయిరీకి చైర్మన్ గా ఉన్న టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ను అరెస్ట్ చేయడం తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు నోటీసులు లేకుండానే ధూళిపాళ్లను అరెస్ట్ చేయడం దారుణమని సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిపై ఉన్మాద ముఖ్యమంత్రి ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు.

సంగం డెయిరీని కంపెనీ యాక్ట్ లోకి మార్చడం తప్పు అంటూ కేసు నమోదు చేశారని... కానీ ఇదే విధంగా విశాఖ డెయిరీ, నల్గొండ డెయిరీ నిర్వాహకులు కూడా చేశారని, వారిపై ఎందుకు చర్యలు తీసుకోరని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. విశాఖ, నల్గొండ డెయిరీలు కంపెనీ యాక్ట్ పరిధిలోకి వచ్చినప్పుడు సంగం డెయిరీ కంపెనీ యాక్ట్ కిందకు వస్తే తప్పెలా అవుతుందని నిలదీశారు. "విశాఖ డెయిరీ నిర్వాహకులు వైసీపీకి చెందినవారన్న కారణంతో చర్యలు తీసుకోలేదా? విజయసాయి పాదయాత్రలో భోజన ఏర్పాట్లు చేశారనా?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంగం డెయిరీ ద్వారా ఒక ట్రస్టు ఏర్పాటు చేసి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ధూళిపాళ్ల నరేంద్ర ప్రయత్నించాడని, అదేనా ఆయన చేసిన తప్పు? అని మండిపడ్డారు. ఏసీబీ, సీఐడీ స్వతంత్ర సంస్థలని, ఉన్మాద సీఎం ఎవరిని అరెస్ట్ చేయమంటే వారిని అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. ధూళిపాళ్ల నరేంద్ర, ఆయన కుటుంబంపై ప్రజల్లో ఎంతో ఆదరణ ఉందని, లేకపోతే ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎలా గెలుస్తాడని అయ్యన్న పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిని ఏ ఆధారాలతో అరెస్ట్ చేశారని ప్రశ్నించారు.

More Telugu News