ముప్పని తెలిసీ కరోనా పేషెంట్లకు సేవ చేస్తున్న ప్రెగ్నెంట్​ నర్స్​

24-04-2021 Sat 14:27
  • రంజాన్ మాసంలో దేవుడిచ్చిన అవకాశమంటున్న నాన్సీ ఆయేజా మిస్త్రీ
  • బిడ్డతో పాటు డ్యూటీ కూడా ముఖ్యమేనని కామెంట్
  • రోజూ 10 గంటల పాటు కొవిడ్ కేంద్రంలో విధులు
  • సూరత్ లోని అల్టాన్ కమ్యూనిటీ అటల్ కేంద్రంలో డ్యూటీ
Pregnant nurse in Surat continues her Covid 19 duty while observing Roza
ఆమె ఓ గర్భవతి. కరోనా ముప్పు వారికి ఎక్కువ ఉంటుందన్న విషయమూ ఆమెకు తెలుసు. కానీ, వృత్తిరీత్యా నర్స్ అయిన ఆమె.. తనకు ఉండే ముప్పు గురించి పట్టించుకోలేదు. ఎదుటి వారి క్షేమం గురించి ఆలోచించింది. తాను గర్భవతి అయినా కూడా కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తూ స్ఫూర్తి చాటుతోంది. వారికి చికిత్స చేస్తూనే రంజాన్ మాసం సందర్భంగా రోజానూ ఆచరిస్తోంది. ఆమె పేరు నాన్సీ ఆయేజా మిస్త్రీ.

గుజరాత్ లోని సూరత్ లో ఉన్న అల్టాన్ కమ్యూనిటీలోని అటల్ కొవిడ్ కేంద్రంలో ఆయేజా విధులు నిర్వర్తిస్తోంది. తన ఆరోగ్యం గురించి ఆలోచించకుండా రోజూ 8 నుంచి 10 గంటల దాకా కరోనా రోగుల సంరక్షణను చూసుకుంటోంది. కోలుకుని వెళ్తున్న వారు తిరిగి ఆశీస్సులను అందిస్తున్నారని, అవే తనకు చాలని ఆయేజా చెబుతోంది.

‘‘నా కడుపులో బిడ్డ పెరుగుతోందని నాకు తెలుసు. కానీ, దాంతో పాటు నాకు నా విధులు కూడా ముఖ్యమే. ఆ దేవుడి దయతో పవిత్ర రంజాన్ మాసంలోనే కరోనా పేషెంట్లకు సేవ చేసే అవకాశం దక్కింది’’ అని ఆమె చెప్పింది. కరోనా ఫస్ట్ వేవ్  సమయంలోనూ అదే కొవిడ్ కేంద్రంలో ఆయేజా విధులు నిర్వర్తించడం విశేషం.