Anil Deshmukh: మహారాష్ట్ర మాజీ హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ మెడకు ఉచ్చు... అభియోగాలు నమోదు చేసిన సీబీఐ!

CBI Files Case Against Maharashtra Ex Home Minister Anil Deshmukh
  • ఈ ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో సోదాలు
  • ప్రాథమిక ఆధారాలు సంపాదించిన సీబీఐ
  • త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం
మహారాష్ట్ర హోమ్ శాఖ మాజీ మంత్రి, ఇప్పటికే పలు ఆరోపణలను ఎదుర్కొంటున్న అనిల్ దేశ్ ముఖ్ పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేేన్ (సీబీఐ) అభియోగాలను నమోదు చేసింది. ఆయనపై కేసును రిజిస్టర్ చేసిన అధికారులు, ఈ ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. అనిల్ దేశ్ ముఖ్ ఇల్లు, ఆయనకు సంబంధించిన ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి.

కాగా, ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్ చేసిన ఆరోపణలు ఇటీవల సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తమకు డబ్బులు వసూలు చేయాలని ఆయన హోమ్ మినిస్టర్ హోదాలో టార్గెట్లు విధించారని చేసిన ఆరోపణలపై శుక్రవారంతో ప్రాథమిక విచారణను పూర్తి చేశామని, తమ విచారణలో ఆధారాలు లభ్యమయ్యాయని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక చట్టం కింద కేసును రిజిస్టర్ చేసి, తదుపరి విచారణను ప్రారంభించామని తెలిపాయి.

దేశ ఆర్థిక రాజధానిగా పేరున్న ముంబైలోని రెస్టారెంట్లు, బార్ల నుంచి నెలకు కనీసం రూ. 100 కోట్లను వసూలు చేసి తీసుకుని రావాలని పోలీసు అధికారి సచిన్ వాజేపై అనిల్ దేశ్ ముఖ్ ఒత్తిడి తెచ్చారని పరంబీర్ సింగ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆపై పోలీసు అధికారుల బదిలీలు, ప్రమోషన్ల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని కూడా ఆరోపించారు. తన ఆరోపణలపై విచారించాలని డిమాండ్ చేస్తూ, పరంబీర్ సింగ్ హైకోర్టును ఆశ్రయించగా, కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ, న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ, ఇప్పటికే అనిల్ దేశ్ ముఖ్ తో సహా పలువురిని విచారించింది కూడా.

ఈ కేసులో సీబీఐ అధికారులకు ప్రాథమిక ఆధారాలు లభ్యం కావడంతో అనిల్ దేశ్ ముఖ్ మెడకు ఉచ్చు బిగుసుకున్నట్టేనని, అతి త్వరలోనే ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Anil Deshmukh
Maharashtra
CBI
Home Minister

More Telugu News