New Delhi: ఆక్సిజన్​ అందక గాల్లో కలిసిన మరో 25 ప్రాణాలు

20 covid patients die of Oxygen Shortage at Delhis Jaipur Golden Hospital
  • ఢిల్లీలోని జైపూర్ గోల్డెన్ ఆసుపత్రిలో ఘటన
  • ఈ రోజు సాయంత్రానికి చేరనున్న ఆక్సిజన్
  • ఆలోపే 25 మంది పేషెంట్లు బలి
  • కేంద్రం తమకు మూడున్నర టన్నులు కేటాయించిందన్న ఆసుపత్రి
ప్రాణ వాయువు సరిపోను అందక ఆసుపత్రుల్లో ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఇప్పటికే చాలా ఆసుపత్రుల్లో అలాంటి ఘటనలు జరిగాయి. తాజాగా మరో ఆసుపత్రిలోనూ అలాంటి ఘటనే పునరావృతం అయింది. ఢిల్లీలోని జైపూర్ గోల్డెన్ హాస్పిటల్ లో ఆక్సిజన్ అందక 25 మంది ఊపిరి వదిలారు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి జరిగింది.

ప్రభుత్వం తమకు 3.5 టన్నుల ఆక్సిజన్ ను కేటాయించిందని, ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు ఆ ఆక్సిజన్ ఆసుపత్రికి చేరాల్సి ఉందని ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ డీకే బలూజా అన్నారు. అయితే, ఆ లోపే 25 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 215 మంది కరోనా పేషెంట్ల పరిస్థితి విషమంగా ఉందని, వారందరికీ ఆక్సిజన్ అందించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.

కాగా, ఢిల్లీలో ఆక్సిజన్ అందట్లేదని ఆసుపత్రులు వరుసగా ఎమర్జెన్సీ సందేశాలు అందిస్తున్నాయి. మ్యాక్స్ ఆసుపత్రి, సర్ గంగారాం హాస్పిటల్, మూల్ చంద్ హాస్పిటళ్లు ఇప్పటికే తమకు వీలైనంత త్వరగా ఆక్సిజన్ ను సరఫరా చేయాలంటూ ప్రభుత్వాన్ని కోరాయి. తాజాగా జైపూర్ గోల్డెన్ ఆసుపత్రిలోనూ అదే పరిస్థితి ఏర్పడింది. దేశంలోని చాలా ఆసుపత్రుల్లో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. కరోనా పేషెంట్ల సంబంధీకులే ఆక్సిజన్ సిలిండర్లను వెంట తెచ్చుకోవాల్సిన దుస్థితులున్నాయి.
New Delhi
COVID19
Oxygen
Jaipur Golden Hospital

More Telugu News