chicken: ఒక్క‌సారిగా భారీగా ప‌డిపోయిన చికెన్ ధ‌ర‌!

  • వారం క్రితం బ్రాయిలర్‌ చికెన్‌ కిలో రూ.220
  • ఇప్పుడు రూ.140-150 మ‌ధ్య‌
  • కిలోకి రూ.70-80 వ‌ర‌కు తగ్గిన వైనం
  • క‌రోనా ఉద్ధృతితో పౌల్ట్రీ ఫారాల్లో కూలీల కొర‌త‌
chicken prices fall

కొన్ని రోజుల క్రితం వ‌ర‌కు కోడి మాంసం ధ‌ర‌ వ‌రుస‌గా పెరిగిపోతూ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. కిలో చికెన్ ధ‌ర రూ.250 కంటే ఎక్కువగా ఉండ‌డంతో దాన్ని కొనాలంటేనే సామాన్యుడు భ‌య‌ప‌డిపోయేవాడు. పెళ్లిళ్ల సీజ‌న్ వ‌స్తుండ‌డం, డిమాండుకు త‌గ్గ చికెన్ అందుబాటులో ఉండ‌కుండా పోవ‌డంతో ఆ ధ‌ర‌లు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని ఇటీవ‌లే వ్యాపారులు చెప్పారు.

అయితే, ప్ర‌స్తుత ప‌రిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. చికెన్ ధ‌ర భారీగా ప‌డిపోయింది. వారం రోజుల‌ క్రితం బ్రాయిలర్‌ చికెన్‌ కిలో రూ.220 గా ఉండ‌గా, ఇప్పుడు అది రూ.140-150కి ప‌డిపోవ‌డం గ‌మ‌నార్హం. అంటే కిలోకి రూ.70-80 వ‌ర‌కు తగ్గింది.

అలాగే, కిలో రూ.120 ఉన్న ఫామ్‌గేట్‌ ధర ఇప్పుడు రూ.80కు దిగి వ‌చ్చింది. వేసవి కారణంగా 30 శాతం వ‌ర‌కు చికెన్‌ వినియోగం తగ్గిపోయింద‌ని వ్యాపారులు అంటున్నారు. ఆదివారం రోజుల‌ను మిన‌హాయిస్తే మిగ‌తా రోజుల్లో  చికెన్ కొనుగోళ్లు అంత‌గా జ‌ర‌గ‌ట్లేదు. చికెన్ మాత్రమే కాదు కోడి గుడ్ల ధరలు కూడా తగ్గాయి. హోల్‌సేల్‌గా 100 గుడ్ల ధ‌ర‌ రూ.50 నుంచి రూ.65 మ‌ధ్య ఉంది.

రిటైల్‌గా ఒక‌ గుడ్డు రూ.5కి ల‌భిస్తోంది. ఎండలకు పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లు అనారోగ్యం పాలవుతున్నాయ‌ని వ్యాపారులు చెబుతున్నారు. అంతేగాకుండా పౌల్ట్రీ ఫారాల్లో  కరోనా ఉద్ధృతి నేప‌థ్యంలో కూలీల కొర‌త అధికంగా ఉండ‌డంతో పౌల్ట్రీలు స‌రిగ్గా న‌డ‌వ‌ట్లేదు. దీంతో ఉన్న కోళ్ల‌ను వ్యాపారులు త‌క్కువ ధ‌ర‌కు అమ్మేసుకుంటున్నారు. దీంతో చికెన్ ధ‌ర‌లు భారీగా ప‌డిపోయాయి.

More Telugu News