నాన్ స్టాప్ గా రజనీ 'అన్నాత్తే' షూటింగ్!

23-04-2021 Fri 18:18
  • హైదరాబాద్ లో 'అన్నాత్తే' షూటింగ్
  • 60 శాతం చిత్రీకరణ పూర్తి
  • దీపావళి కానుకగా రిలీజ్
Annaatthe shooting in Ramoji Film City
రజనీకాంత్ కథానాయకుడిగా 'అన్నాత్తే' సినిమా రూపొందుతోంది. మాస్ కథలతో మెప్పిస్తూ వస్తున్న శివ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ పాటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కావలసింది. కానీ కరోనా కారణంగా ఆగుతూ .. మొదలవుతూ వస్తోంది. ఇంతవరకూ 60 శాతం చిత్రీకరణను జరుపుకుంది. మిగతా 40 శాతం చిత్రీకరణను ఇక ఆపకుండా జరపాలనే ఉద్దేశంతో రజనీ ఉన్నారట. అందువలన హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగును జరుపుకుంటోంది.

కరోనా పరిస్థితుల కారణంగా చాలా తక్కువమంది సిబ్బందితో షూటింగును కానిచ్చేస్తున్నారు. ప్రధాన పాత్రల నేపథ్యంలోని కొన్ని కీలకమైన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. హైదరాబాద్ నేపథ్యంలో నైట్ ఎఫెక్ట్ తో కూడిన సీన్స్ ను కూడా చిత్రీకరించవలసి ఉందట. అయితే ప్రస్తుతం ఇక్కడ నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంది. అందువలన ప్రత్యేక అనుమతుల కోసం ఈ సినిమా టీమ్ ప్రయత్నాలు చేస్తోందట. ఖుష్బూ .. మీనా .. నయనతార .. కీర్తి సురేశ్ పాత్రలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.