'రంగస్థలం' సీక్వెల్ కి రెడీ అవుతున్నారా?

23-04-2021 Fri 17:44
  • శంకర్ తో సెట్స్ పైకి వెళ్లనున్న చరణ్
  • విజయ్ దేవరకొండ ప్రాజెక్టుతో సుకుమార్
  • ఆ తరువాత రంగంలోకి చరణ్ - సుకుమార్  
Rangasthalam Cinema Sequel
చరణ్ ఒక వైపున 'ఆర్ ఆర్ ఆర్' .. మరో వైపున 'ఆచార్య' సినిమా పనులను చక్కబెడుతూ వస్తున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత ఆయన శంకర్ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో చరణ్ కొత్తగా కనిపిస్తాడనీ, ఫైట్స్ .. డాన్సులు ఒక రేంజ్ లో ఉండేలా శంకర్ ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. ఈ సినిమా తరువాత చరణ్ .. సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అది 'రంగస్థలం' సినిమాకి సీక్వెల్ అనే టాక్ వినిపిస్తోంది.


సుకుమార్ - చరణ్ కాంబినేషన్లో 2018 మార్చిలో వచ్చిన 'రంగస్థలం' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. చిట్టిబాబు పాత్రలో చరణ్ జీవించాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లింది. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ చేయాలని సుకుమార్ - చరణ్ ఇద్దరూ కూడా నిర్ణయించుకున్నారని చెప్పుకుంటున్నారు. శంకర్ సినిమాను చరణ్ పూర్తి చేసేలోగా, విజయ్ దేవరకొండతో సినిమాను సుకుమార్ పూర్తిచేస్తాడు. ఆ తరువాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందన్న మాట.