తిరిగి ట్రాక్ లోకి వస్తున్న 'భారతీయుడు 2'!

23-04-2021 Fri 16:44
  • కమల్, శంకర్ కాంబోలో 'భారతీయుడు 2'
  • కొంత షూటింగ్ తర్వాత ఆగిన ప్రాజక్టు 
  • నిర్మాత, దర్శకుల మధ్య అభిప్రాయభేదాలు
  • కోర్టు జోక్యంతో తిరిగి షూటింగుకి ఏర్పాట్లు
  • వివేక్ స్థానంలో మరో నటుడి ఎంపిక
Indian sequel shoot to be started soon
కమల్, శంకర్ కలయికలో పాతికేళ్ల క్రితం వచ్చిన 'భారతీయుడు' (తమిళంలో ఇండియన్) సినిమా అప్పట్లో ఓ సంచలనం. కమల్ అభినయానికి.. శంకర్ దర్శకత్వ ప్రతిభకి ప్రేక్షకులు జేజేలు పలకగా... బాక్సాఫీసు వద్ద కనక వర్షం కురిసింది. ఇన్నేళ్ల తర్వాత గతేడాది ఈ చిత్రం సీక్వెల్ నిర్మాణం మొదలైంది.

చాలావరకు షూటింగు జరిగాక.. సెట్స్ లో ప్రమాదం జరిగి కొందరు టెక్నీషియన్లు మరణించడం జరిగింది. తర్వాత నిర్మాత, దర్శకుల మధ్య అభిప్రాయ భేదాలు రావడం.. ఇంతలో కరోనా రావడం.. ఈ కారణాల వల్ల గత కొంతకాలంగా చిత్రనిర్మాణం ఆగిపోయింది. తర్వాత దర్శకుడు శంకర్ పై నిర్మాత కోర్టుకి వెళ్లడంతో సమస్యను కోర్టు బయట సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోమంటూ న్యాయస్థానం ఇరువురికీ సూచించింది. దీంతో మళ్లీ షూటింగ్ ప్రయత్నాలు మొదలవుతున్నట్టు సమాచారం.

ఇదిలావుండగా, ఇదే సమయంలో ఇటీవల హాస్య నటుడు వివేక్ మరణించడం కూడా ఈ చిత్రానికి కొంత నష్టాన్ని కలిగించింది. ఇందులో వివేక్ ది కీలక పాత్ర. అతనిపై ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరిగింది. ఇప్పుడు అతని స్థానంలో మరో నటుడిని తీసుకుని ముందుగా ఆ సన్నివేశాలన్నీ చిత్రీకరించడానికి దర్శకుడు శంకర్ ప్లాన్ చేస్తున్నాడట. మొత్తానికి 'భారతీయుడు 2' మళ్లీ ట్రాక్ లోకి వస్తోందన్న మాట!