ఇద్దరు పిల్లలపై శానిటైజర్​ పోసి.. తానూ పోసుకుని నిప్పంటించుకున్న తల్లి

23-04-2021 Fri 14:04
  • తల్లీబిడ్డ అగ్నికి ఆహుతి
  • తప్పించుకున్న ఆమె కుమారుడు
  • నెల్లూరు జిల్లా నెల్లూరుపాలెంలో ఘటన
Mother Pours Sanitizer On Her Two Kids Dies

పాపం.. ఏ కష్టమొచ్చిందో ఏమో గానీ ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకు నిప్పంటించి, తనూ అంటించుకుంది. ఈ ఘటనలో తన ఐదేళ్ల కూతురుతో పాటు ఆమె ప్రాణాలు విడిచింది. అయితే, ఆమె కొడుకు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలోని నెల్లూరుపాలెంలో శుక్రవారం జరిగింది. ఘటన వివరాలను ఆత్మకూరు సీఐ సోమయ్య వెల్లడించారు.

నెల్లూరుపాలెంకు చెందిన సుబ్బులు అనే మహిళ కర్ణాటకలోని బళ్లారిలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తోంది. అయితే, గురువారం ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి సొంతూరుకు బయల్దేరింది. శుక్రవారం తెల్లవారుజామున నెల్లూరుపాలెంలో దిగింది. ఊర్లోకి వెళ్లకుండా శ్మశాన వాటిక స్థలం వద్ద వెంట తెచ్చుకున్న శానిటైజర్ ను ఇద్దరు పిల్లలు, తనపై పోసుకుంది. అనంతరం నిప్పంటించేసింది.

దీంతో సుబ్బులు, ఆమె ఐదేళ్ల కూతురు మధురవాణి అగ్నికి ఆహుతైపోయారు. అయితే, ఆమె కుమారుడు మహేశ్ వేడికి తాళలేక పరుగెత్తడంతో మంటలు ఆరిపోయాయి. వెంటనే గ్రామస్థులకు విషయం చెప్పడంతో వారు అక్కడకు వచ్చారు. అప్పటికే తల్లీబిడ్డలిద్దరూ చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.