పవన్ సినిమాలో అలీకి ఛాన్స్ దక్కనుందా?

23-04-2021 Fri 12:18
  • పవన్ - అలీ ఒకప్పటి స్నేహితులు
  • పవన్ సినిమాల్లో అలీ తప్పనిసరి
  • రాజకీయపరమైన మనస్పర్థలు  
Is Ali acting in Pavan movie

ఒకప్పుడు పవన్ కల్యాణ్ తో 'అలీ'కి మంచి స్నేహం ఉండేది. పవన్ కల్యాణ్ సినిమాల్లో అలీ తప్పకుండా ఉండవలసిందే. వాళ్ల సాన్నిహిత్యం గురించి తెలిసిన రచయితలు .. దర్శకులు అలీ కోసం ఒక పాత్రను తప్పకుండా క్రియేట్ చేసేవారు. అలా పవన్ సినిమాల్లో దాదాపుగా అలీ కనిపిస్తూ వచ్చాడు.

 అయితే పవన్ రాజకీయాల్లోకి వెళ్లాక ఈ స్నేహం కాస్త మసకబారింది. అలీ వేరే పార్టీలోకి వెళ్లడం ..  ఆ సందర్భంలో ఒకరిపై ఒకరు మాటల బాణాలు సంధించుకోవడం జరిగింది. అలా ఇద్దరి మధ్యా దూరం పెరిగింది. ఆ సీన్ ను అక్కడ కట్ చేస్తే, ఇప్పుడు పవన్ రీ ఎంట్రీ ఇవ్వడం .. హిట్ కొట్టడం జరిగిపోయాయి.

పవన్ కథానాయకుడిగా వరుసగా భారీ సినిమాలు రూపొందుతున్నాయి. క్రిష్ .. సాగర్ .కె చంద్ర .. సినిమాలు సెట్స్ పై ఉండగా, హరీశ్ శంకర్ .. సురేందర్ రెడ్డి .. త్రివిక్రమ్ ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ పవన్ తో కలిసి అలీ నటించే అవకాశం ఉందా? అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అలీ మాట్లాడుతూ, అవకాశం వస్తే పవన్ తో కలిసి నటించడానికి తాను సిద్ధమని అన్నాడు. ఇక రాజకీయ పరమైన అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ తాజాగా ప్రకాశ్ రాజ్ తో కలిసి నటించిన పవన్, అలీ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేయకపోవచ్చని అనుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..!