త్వరగా లాగించేయమని చెప్పిన పడిక్కల్ తో నేనన్న మాట ఒక్కటే: విరాట్ కోహ్లీ

23-04-2021 Fri 10:53
  • వికెట్ నష్టపోకుండా ఆర్సీబీ విజయం
  • ముందుగా సెంచరీ చేయాలని పడిక్కల్ కు సూచించా
  • మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ
I Told Only One Word to Padikkal Says Kohli

గడచిన ఐపీఎల్ 13 సీజన్లలో ఎన్నడూ లేనట్టుగా, ఈ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు దూసుకెళుతోంది. వరుసగా నాలుగు మ్యాచ్ లను గెలిచిన ఆర్సీబీ, మిగతా టీముల కన్నా అధిక పాయింట్లు సాధించడంతో పాటు, నెట్ రన్ రేట్ పరంగానూ మెరుగైన స్థితిలో ఉంది. గత రాత్రి రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఒక్క వికెట్ ను కూడా నష్టపోకుండా గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఓపెనర్లుగా బరిలోకి దిగిన దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీలు ఇద్దరూ కలిసి తమ ముందున్న 178 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించారు.

ఈ మ్యాచ్ లో తనకు, పడిక్కల్ కు మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ గురించి మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ వెల్లడించాడు. అప్పటికే మంచి ఊపుమీదున్న పడిక్కల్, తన వద్దకు వచ్చి, మ్యాచ్ ని తొందరగా ముగించేయాలని కోరాడని, తాను మాత్రం, కొంచెం నిదానంగా ఆడుతూ అయినా, సెంచరీ సాధించాలని పడిక్కల్ కు చెప్పానని కోహ్లీ వ్యాఖ్యానించాడు. అతని స్కోర్ మూడంకెలకు చేరుతుందని ఊహించానని, ఆ మైలురాయిని అందుకునేందుకు ప్రయత్నించాలని సూచించానని అన్నాడు.

పడిక్కల్ తొలి సెంచరీకి దగ్గరవుతున్న వేళ, తాను అతనికే ఎక్కువగా స్ట్రయికింగ్ ఇవ్వడానికి ప్రయత్నించానని, ఆపై 16వ ఓవర్ తొలి బంతికి 100 పరుగులను దాటి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నాడని, అతన్నుంచి మరిన్ని మంచి ఇన్నింగ్స్ లను చూస్తానని అనుకుంటున్నానని చెప్పాడు.