Social Media: పూణె మహిళ నుంచి రూ. 3.98 కోట్లు నొక్కేసిన ఆన్ లైన్ కేటుగాళ్లు!

  • సోషల్ మీడియా మాధ్యమంగా పరిచయం
  • పలు బహుమతుల పేరిట డబ్బు వసూలు
  • కేసును విచారిస్తున్న పోలీసులు
Online Fruaders Take 4 Crores from Pune Lady

పూణెకు చెందిన ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్న ఉన్నతోద్యోగి నుంచి సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ. 3.98 కోట్లు నొక్కేశారు. సోషల్ మీడియా మాధ్యమంగా వారు పన్నిన వలలో 60 సంవత్సరాల వయసున్న మహిళ పడిపోయిందని సైబర్ సెల్ అధికారి అంకుష్ చింతామణ్ వెల్లడించారు. కేసు గురించిన మరిన్ని వివరాలు తెలుపుతూ, గత కొన్ని నెలలుగా, 27 విభిన్న ఖాతాల్లో 207 లావాదేవీల ద్వారా ఈ డబ్బును కేటుగాళ్లు కొట్టేశారని ఆయన పేర్కొన్నారు.

ఏప్రిల్ 2020లో బాధితురాలికి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ మాధ్యమంగా ఓ ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఆ వ్యక్తి, తాను బ్రిటన్ కు చెందిన వాడినని పేర్కొన్నాడు. ఐదు నెలల పాటు వారి మధ్య సంభాషణలు జరుగగా, తనను ఆమె పూర్తిగా నమ్మిందని నిర్ధారించుకున్న తరువాత, వారి ప్లాన్ ను అమలు చేశారు. తొలుత పుట్టిన రోజు బహుమతిగా ఓ ఐఫోన్ ను పంపుతున్నట్టు చెప్పారు. ఆపై ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి వచ్చిన ఫోన్ కాల్ తో కస్టమ్స్ సుంకాలను చెల్లిస్తున్నానని భావించి, ఆమె డబ్బు కట్టింది.

ఆ తరువాత కొరియర్ ఏజన్సీ ప్రతినిధులమని, ఫోన్ చేసి, మీ పేరిట ఆభరణాలు, విదేశీ కరెన్సీ వచ్చిందని, కొంత డబ్బు కడితేనే వస్తాయని నమ్మ బలికితే మరోమారు మోసపోయింది. మొత్తం మీద వివిధ బహుమతుల పేర్లు చెబుతూ, సెప్టెంబర్ 2020 నుంచి మొత్తం రూ. 3,98,75,500ను ఆమె నుంచి లాగేశారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్నామని, ఐపీసీ, ఐటీ చట్టాల ప్రకారం కేసు రిజిస్టర్ చేసి, విచారిస్తున్నామని అంకుష్ వెల్లడించారు.

More Telugu News