పవన్ కల్యాణ్ పారితోషికం ఇప్పుడు హాట్ టాపిక్!

23-04-2021 Fri 10:06
  • యూత్ లో విపరీతమైన క్రేజ్
  • ఫ్లాపులు పడినా తగ్గని మార్కెట్
  • రీ ఎంట్రీతో పెరిగిన పారితోషికం
Pavan Kalyan Huge Remuneration in Vakeel Saab

పవన్ కల్యాణ్ చాలా తక్కువ సమయంలో తన క్రేజ్ ను ఎవరెస్టు స్థాయికి తీసుకెళ్లిన హీరో. మెగా బ్రదర్ గా పరిచయమైనప్పటికీ, ఎప్పుడూ ఎక్కడా కూడా చిరంజీవిని అనుకరించే ప్రయత్నం చేయలేదు. తనకంటూ ఒక బాడీలాంగ్వేజ్ .. తనకంటూ ఒక స్టైల్ ను ఆయన సెట్ చేసుకున్నారు. యూత్ ను .. మాస్ ను పూర్తిస్థాయిలో తనవైపుకు తిప్పేసుకున్నారు. అదే సమయంలో ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్ కి రప్పించడంలో సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా అపజయాలకు అతీతమైన ఇమేజ్ ను సంపాదించుకోగలగడం ఆయన గొప్పతనం.

అలాంటి పవన్ కల్యాణ్ ఒక సినిమాకి ఎంత పారితోషికం తీసుకుంటున్నారనే విషయం తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోను ఉంటుంది. 'అత్తారింటికి దారేది' సినిమా సమయంలో ఆయన 30 కోట్లవరకూ పారితోషికం తీసుకుంటున్నట్టుగా వార్తలు షికారు చేశాయి. చాలా గ్యాప్ తరువాత ఆయన 'వకీల్ సాబ్' తో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాకి ఆయన ఎంత తీసుకుని ఉంటారనేది అందరిలో తలెత్తే ప్రశ్న. ఈ సినిమాకి గాను ఆయనకి పారితోషికంగా 50 కోట్ల వరకూ ముట్టిందనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇందులో వాస్తవమెంతనేది అలా ఉంచితే, అందరూ ఈ విషయాన్ని గురించే ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.